Begin typing your search above and press return to search.

ఎక్కడైనా ఒకటే; అప్పుడు సత్యం.. ఇప్పుడు తోషిబా

By:  Tupaki Desk   |   22 July 2015 10:25 AM IST
ఎక్కడైనా ఒకటే; అప్పుడు సత్యం.. ఇప్పుడు తోషిబా
X
ఆంధ్రా అయినా.. జపాన్ అయినా వ్యాపారంలో అడ్డగోలు వ్యవహారాలు మామూలే అన్న విషయం మరోసారి నిరూపితమైంది. కొన్నేళ్ల క్రితం ప్రముఖ ఐటీ సంస్థ సత్యం వ్యవరించిన తీరులోనే.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ.. జపాన్ కు చెందిన తోషిబా వ్యవహరించటం తాజా సంచలనం. కాకపోతే.. ఈ రెండింటి మధ్య ఒక వైరుధ్యం ఉంది. తన కంపెనీ పాల్పడిన అనైతిక కార్యకలాపాల మీద సత్యం రామలింగరాజు స్వయంగా ఒప్పుకుంటే.. తోషిబా వ్యవహారం మాత్రం ఒక స్వతంత్ర బృందం ఇచ్చిన నివేదికలో బయటపడింది.

తాజా కుంభకోణం గురించి సింఫుల్ గా.. సూటిగా ఒక్కమాటలో చెప్పాలంటే.. కంపెనీకి లేని లాభాల్ని చూపిస్తూ.. మదుపరుల్ని మోసం చేయటం.. సంస్థ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని భ్రమింపచేయటం. చేతిలో చిల్లిగవ్వ లేకుండా.. లక్షాధికారి అన్న ఫోజు కొట్టే వారి మాదిరే కంపెనీలు కాస్త అటూఇటూగా సత్యం.. తోషిబాలు వ్యవహరించాయి. లేని లాభాల్ని చూపిస్తూ.. ఒక క్రమపద్ధతిలో వాటాదార్లను.. మార్కెట్ ను మోసం చేస్తూ.. సంస్థ మోసం చేసింది.

తాజా కుంభకోణం బయటకు రావటం జపాన్ పారిశ్రామిక రంగం పెద్ద షాక్ కు గురైంది. నిజాయితీ కార్పొరేట్ వ్యవహారాలకు పెట్టింది పేరు అయినా జపాన్ లో ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించనిది. తాజాగా తన తప్పుడు లాభాలు చూపించిన తోషిబా కుంభకోణం విలువ సుమారు రూ.7800కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. తాజా కుంభకోణం బయటపడటంతో వాటాదార్లు తనను క్షమించాలని కోరుతూ.. 30 సెకన్లు తల దించుకున్న తోషిబా అధ్యక్షుడు హిసోవా తనకా తన పదవికి రాజీనామా చేశారు.

ఆయన అర నిమిషం పాటి తల దించుకోవటం కోట్లాది మంది వందల కోట్ల రూపాయిల మీద ప్రభావం చూపిస్తుందన్న విషయం మర్చిపోకూడదు. ఇక్కడ మరో ఆసక్తికర కోణం ఉంది. సత్యం అక్రమాల గురించి దాని అధిపతి రామలింగరాజు స్వయంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వెల్లడిస్తే.. తోషిబా విషయంలో మాత్రం జపాన్లో తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త విధానం ఈ కుంభకోణాన్ని బయటపెట్టేలా చేసింది.

జపాన్ కంపెనీల్లో వాటాదారులకు పాదర్శకత కోసం.. వారికి సరైన సమాచారం అందించటం కోసం ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ప్రకారం.. స్వతంత్ర సంస్థ కంపెనీ వ్యవహారాల్ని మదింపు చేస్తుంది. అలా చేసిన క్రమంలో తోషిబా కుంభకోణం బయటకు వచ్చింది.