కల్కి బాక్సాఫీస్.. టార్గెట్ పెద్దదే!
ఈ స్టార్స్ అందరి ఇమేజ్ సినిమాకి ఆదరణ తీసుకొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మొదటి రోజు 150 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
By: Tupaki Desk | 28 April 2024 5:39 AM GMTఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి 2898ఏడీ సినిమా తెరకెక్కుతోంది. హిందూ మైథాలజీ బేస్ చేసుకొని సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో శ్రీమహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కి పాత్రలో నటించాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జూన్ 27న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో రిలీజ్ కాబోతోంది.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కల్కి 2898ఏడీ మూవీ అతి పెద్ద రిలీజ్ గా రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. హాలీవుడ్ లో కూడా ఈ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. 600 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ డీల్స్ నడుస్తున్నాయి. హిందీలో ఈ సినిమా రైట్స్ ని 100 కోట్లకి ప్రముఖ డిస్టిబ్యూటర్ అనిల్ తడాని సొంతం చేసుకున్నారు.
100 కోట్ల డీల్ అంటే ప్రభాస్ మార్కెట్ లెక్కల ప్రకారం చూసుకుంటే భారీగానే జరిగినట్లు. అయితే ఈ సినిమాపై పెట్టిన బడ్జెట్ ప్రకారం చూసుకుంటే హిందీలో కల్కి 2898ఏడీ మూవీ జరిగిన బిజినెస్ తక్కువ అని చెప్పాలి. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, సలార్ సినిమాలు హిందీలో 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేశాయి. అయితే ఈ సినిమాలపై బిజినెస్ ఆధారంగా చూసుకుంటే సలార్ మూవీకి హిందీలో లాభాలు వచ్చాయని చెప్పొచ్చు.
కల్కి మూవీ 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సౌత్ లో ఈ సినిమా ఎంత భారీ హిట్ అయిన 300 నుంచి 400 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. దీనిని బట్టి చూసుకుంటే హిందీలో కల్కి మూవీకి 200 నుంచి 220 కోట్ల మధ్య నెట్ కలెక్షన్స్ వసూళ్లు చేస్తే సినిమాకి లాభాలు వస్తాయి. అలాగే ఓవర్సీస్ లో కూడా 150 కోట్లకి పైగా వసూళ్లు చేయాల్సి ఉంటుంది. ఇండియన్ సినిమాకి హాలీవుడ్ లో ఇంకా మార్కెట్ క్రియేట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మెజారిటీ కలెక్షన్స్ కోసం ఇండియన్ బాక్సాఫీస్ మీదనే ఆధారపడాలి. నాగ్ అశ్విన్ కి ఇది ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్.
అయితే బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్, దీపికా పదుకునే లాంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. అలాగే కమల్ హాసన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. డార్లింగ్ ప్రభాస్ కి పాన్ ఇండియా రేంజ్ లో 300 నుంచి 400 కోట్ల మార్కెట్ ఉంది. ఈ స్టార్స్ అందరి ఇమేజ్ సినిమాకి ఆదరణ తీసుకొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మొదటి రోజు 150 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే సాలిడ్ హిట్ కావాలంటే మాత్రం కల్కి2898ఏడీ మూవీ కనీసం 3 నుంచి 4 వారల పాటు థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.