Begin typing your search above and press return to search.

'ఖుషి'కి ఊహించని కష్టం!

విజయ్ దేవరకొండ, సమంతల క్రేజీ కాంబినేషన్లో శివ నిర్వాణ రూపొందించిన ‘ఖుషి’ సినిమా టాక్ మరీ గొప్పగా ఏమీ లేదు.

By:  Tupaki Desk   |   4 Sep 2023 10:41 AM GMT
ఖుషికి ఊహించని కష్టం!
X

విజయ్ దేవరకొండ, సమంతల క్రేజీ కాంబినేషన్లో శివ నిర్వాణ రూపొందించిన ‘ఖుషి’ సినిమా టాక్ మరీ గొప్పగా ఏమీ లేదు. అదే సమయంలో నెగెటివ్ టాక్ కూడా రాలేదు. యావరేజ్.. వన్ టైం వాచ్.. అన్న టాక్‌తోనే ఈ చిత్రం తొలి వీకెండ్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా రేంజికి ఫస్ట్ వీకెండ్లో రూ.70 కోట్ల గ్రాస్ అంటే చిన్న విషయం కాదు. మేకర్స్ చెబుతున్నట్లు రూ.70 కోట్లు కాకపోయినా.. 60 కోట్లకు తక్కువగా అయితే గ్రాస్ రాలేదు. షేర్ రూ.40 కోట్ల మార్కును దాటింది.

యుఎస్‌లో ఈ చిత్రం ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాట పట్టేసింది. నైజాంలో బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ చిత్రం అండర్ పెర్ఫామ్ చేస్తోంది. ఓ మోస్తర వసూళ్లతో సాగుతోంది. అక్కడ రికవరీ 60 శాతానికి అటు ఇటుగా ఉంది. ఈ వారం అంతా కూడా సినిమా బాగా ఆడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఐతే సినిమాకు వచ్చిన టాక్‌తో వీక్ డేస్‌లో రన్ ఎలా ఉంటుందో అన్న భయాలు బయ్యర్లను వెంటాడుతున్నాయి.

ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలకు కూడా వీకెండ్ తర్వాత వసూళ్లు డ్రాప్ అవుతుంటాయి. ‘ఖుషి’ లాంటి యావరేజ్ టాక్ ఉన్న సినిమాకు సోమవారం నుంచి వసూళ్లలో ఎక్కువ డ్రాప్ ఉంటుందేమో అన్న భయాలున్నాయి. వాళ్ల భయాలను ఇంకా పెంచుతూ.. వర్షం రూపంలో పెద్ద బాంబు పడింది. తెలుగు రాష్ట్రాలను సోమవారం నుంచి వర్షాలు ముంచెత్తేస్తున్నాయి. అన్ని చోట్లా ఉదయం వర్షాలు పడ్డాయి. ఈ వర్షం ఒక పూటకో, ఒక రోజుకో పరిమితం కాదు. ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగబోతున్నాయట.

వర్షాలు వస్తే జనాలు థియేటర్ల వరకు వచ్చి సినిమాలు చూడటం కష్టమే. ఇలా రోజుల తరబడి వర్షాలు పడితే.. అసలే బయటికి రారు. అలాంటపుడు ‘ఖుషి’కి ఇక్కడ్నుంచి ఆశించిన వసూళ్లు ఉండవు. మూడు రోజులు గడిస్తే.. గురువారానికి జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి థియేటర్లలోకి దిగుతున్నాయి. వాటికి టాక్ బాగుంటే ‘ఖుషి’ పక్కకు వెళ్లిపోతుంది. ఈ పరిస్థితుల్లో నైజాంలో బ్రేక్ ఈవెన్ అయినా పెద్దగా లాభాలు ఉండవు. ఏపీలో నష్టాలు తప్పవు అన్నట్లే.