Begin typing your search above and press return to search.

ఓవ‌ర్ నైట్ 150కోట్లు లాభం.. అంబానీతో ఆలియా డీల్!

సోషల్ మీడియాలో త‌న కంపెనీకి తరచుగా ప్రచారం

By:  Tupaki Desk   |   18 July 2023 4:16 AM GMT
ఓవ‌ర్ నైట్ 150కోట్లు లాభం.. అంబానీతో ఆలియా డీల్!
X

RRR సీత‌గా ఆలియా భ‌ట్ తెలుగు లోగిళ్ల‌కు సుప‌రిచిత‌మైన‌ సంగ‌తి తెలిసిందే. అటు ఉత్త‌రాది ఇటు ద‌క్షిణాది రెండు చోట్లా ఆలియా న‌ట‌న‌కు అభిమానులున్నారు. మునుముందు ఈ బ్యూటీ టాలీవుడ్ అగ్ర హీరోల స‌ర‌సన న‌టించేందుకు ఆస్కారం లేక‌పోలేదు. ఆలియా న‌టించిన ఇటీవ‌లి చిత్రాలు ఆర్.ఆర్.ఆర్ - గంగుభాయి క‌థియావాడీ-బ్ర‌హ్మాస్త్ర‌ త‌న కెరీర్ లో మ‌రపురాని విజ‌యాలుగా నిల‌వ‌డ‌మే గాక ఆలియాకు ప్ర‌త్యేక స్థానాన్ని క‌ల్పించాయి.

ఓవైపు కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్న ఈ బ్యూటీ మ‌రోవైపు ఎంట‌ర్ ప్రెన్యూర్ గాను దూసుకుపోతోంది. వ్యాపార రంగంలో త‌న‌దైన ముద్ర వేస్తోంది. ఇటీవ‌లే సొంతంగా నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించి సినిమాలు తీస్తున్న‌ ఆలియా భ‌ట్ 2020లో `ఎడ్-ఎ-మమ్మా` పేరుతో పిల్లల దుస్తుల బ్రాండ్ ను స్వ‌యంగా ప్రారంభించింది.

సోషల్ మీడియాలో త‌న కంపెనీకి తరచుగా ప్రచారం చేసే ఆలియా పలువురు ప్రముఖుల వార‌సుల కోసం తన బ్రాండ్ దుస్తులను పంపిన సంగ‌తి తెలిసిందే. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఆలియా వ‌స్త్ర శ్రేణి బ్రాండ్ ను తమ సోషల్ మీడియాల్లో విరివిగా ప్రచారం చేసి విజయవంతమైన దుస్తుల లేబుల్ గా మార్చారు.

ఇప్పుడు జాతీయ మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. అలియాకి చెందిన‌ ఎడ్-ఎ-మమ్మా కంపెనీని రిల‌య‌న్స్ ముఖేష్ అంబానీ ఆయ‌న‌ కుమార్తె ఇషా అంబానీ సంయుక్తంగా కొనుగోలు చేయనున్నార‌ని తెలిసింది. మల్టీ-బిలియనీర్ తండ్రి-కుమార్తె ద్వయం గ్రోత్ రేటు అత్యంత వేగంగా ఉన్న‌ పిల్లల దుస్తుల శ్రేణి విభాగంలో తమ స్థానాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు సంక‌ల్పించార‌ని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎడ్-ఎ-మమ్మా పాపుల‌రైన బ్రాండ్ కాబట్టి ఈ కంపెనీని కొనుగోలు చేయ‌డం అంబానీల వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు.

ఆలియా బ్రాండ్ ఈ ఏడాది ప్రారంభంలో రూ. 150 కోట్లకు పైగా మూల ఆస్తుల‌ను కలిగి ఉందని.. దీనికి రెట్టింపు మొత్తాన్ని ఆలియాకు చెల్లిస్తార‌ని జాతీయ మీడియా నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. అంబానీ తండ్రీ కూతుళ్ల ద్వయం దాదాపు రూ. 300-350 కోట్లకు స‌ద‌రు కంపెనీని కొనుగోలు చేయాలని ప్రతిపాదించినట్లు మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయి. కేవ‌లం 7 నుంచి 10 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోవచ్చని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఆలియా భట్ కి కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` త్వ‌ర‌లో విడుద‌ల‌కు రానుంది. హాలీవుడ్ లో తొలి చిత్రం `హార్ట్ ఆఫ్ స్టోన్`లో గాల్ గడోట్ తో పాటు క‌నిపించ‌నుంది. ఇందులో ఆలియా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. య‌ష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివ‌ర్శ్ లో తెర‌కెక్క‌నున్న 8వ చిత్రంలో ఆలియా భ‌ట్ గూఢ‌చారిగా న‌టించ‌నుంది. ఇది పూర్తిగా మ‌హిళా ప్రాధాన్య చిత్ర‌మ‌ని నిర్మాత‌ ఆదిత్య చోప్రా స‌న్నిహితుల నుంచి స‌మాచారం లీకైంది.