ఎలన్ మస్క్ కు రూ.1.64 లక్షల కోట్లు లాస్..కారణం ఇదే?
ఎలన్ మస్క్ కు భారీ షాక్ తగిలింది. గురువారం ఒక్కరోజే సుమారు 20.3 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదను మస్క్ కోల్పోయారు.
By: Tupaki Desk | 21 July 2023 2:36 PM GMTఅమెరికాలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ కు భారీ షాక్ తగిలింది. గురువారం ఒక్కరోజే సుమారు 20.3 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదను మస్క్ కోల్పోయారు. అంటే భారత కరెన్సీలో రూ.1.64 లక్షల కోట్లకు పైచులుకే అన్నమాట.
అవును... టెస్లా షేర్ల భారీ పతనం తో మస్క్ ఒక్కరోజే ఏకంగా లక్షన్నర కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. ఫలితంగా ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 20.3 బిలియన్ డాలర్లు తగ్గి, 234.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయినప్పటికీ ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ ఇంకా అగ్రస్థానంలోనే కొనసాగుతుండటం గమనార్హం.
అమెరికాలో వడ్డీరేట్లు ఇలాగే పెంచితే ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ పెంచుకోవడానికి ధరలు తగ్గిస్తామని ఎలన్ మస్క్ చేసిన ప్రకటన.. ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడిందని తెలుస్తుంది. దీంతో గురువారం ట్రేడింగ్ లో టెస్లా షేర్ విలువ 9.7 శాతం పతనమై 269.90 డాలర్లకు చేరుకుంది.
ఈ ఏడాది జూన్ లో ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ స్థాపించిన లగ్జరీ వస్తువుల తయారీ సంస్థ ఎల్‌వీఎంహెచ్ షేర్లు కూడా భారీగా పతనమవ్వడంతో ఆయన సంపద తరిగిపోయింది. దీంతో మస్క్ మళ్లీ బెర్నార్డ్ ను దాటి ప్రపంచ కుబేరుడి జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.
అయితే ఈ షేర్ల పతనంతో కుబేరుల వ్యక్తిగత సంపద పతనం వీరికి మాత్రమే పరిమితం కాలేదు. వీరితోపాటు అమెజాన్ డాట్ కామ్ అధినేత జెఫ్ బెజోస్, ఒరాకిల్ కార్పొరేషన్ చీఫ్ ల్యారీ ఎల్లిషన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ కో పౌండర్లు ల్యారీ పేజ్, సెర్జెయి బ్రిన్ కూడా 20.8 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద కోల్పోయారని తెలుస్తుంది.