శ్రీకృష్ణుడి పుట్టినరోజు... ఈ రేంజులో వ్యాపారమా!
దేవదేవుడు.. శ్రీకృష్ణుడి పుట్టినరోజు అయిన జన్మాష్టమి దేశవ్యాప్తంగా కనులపండువగా జరిగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Aug 2024 6:05 AM GMTదేవదేవుడు.. శ్రీకృష్ణుడి పుట్టినరోజు అయిన జన్మాష్టమి దేశవ్యాప్తంగా కనులపండువగా జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని వైష్ణవాలయాలు, ఇస్కాన్ మందిరాలు పూలతో, విద్యుద్దీపాల అలంకరణలతో కొత్త రూపును సంతరించుకున్నాయి.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా రూ.25 వేల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ మేరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కాయిట్) వివరాలు వెల్లడించింది.
కాయిట్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీలోని చాందినీ చౌక్ ఎంపీ అయిన ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయన్నారు. ముఖ్యంగా పువ్వులు, పండ్లు, స్వీట్లు, దేవతా వస్త్రాలు, అలంకరణ వస్తువులు, ఉపవాస ఆహార పదార్థాలు, పాలు, పెరుగు, వెన్న, డ్రై ప్రూట్స్ భారీ ఎత్తున అమ్ముడుపోయాయన్నారు.
జన్మాష్టమి వంటి పండుగలు సనాతన ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగమని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఖండేల్వాల్ తెలిపారు.
అలాగే కాయిట్ జాతీయ అధ్యక్షుడు బిసి భారతియా మాట్లాడుతూ
జన్మాష్టమి పండుగ ప్రత్యేక ఆకర్షణలలో డిజిటల్ టేబుల్ లాక్స్, శ్రీకృష్ణుడి విగ్రహాలు ఉన్నాయన్నారు.
కాగా ఆగస్టు ప్రారంభంలో.. రాఖీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ.12,000 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు కాయిట్ అంచనా వేసింది.
2022లో రాఖీ పండుగ సందర్భంగా దాదాపు రూ.7,000 కోట్ల వ్యాపారం జరిగింది, 2021లో రూ.6,000 కోట్లు, 2020లో రూ.5,000 కోట్లు, 2019లో రూ.3,500 కోట్లు, 2018లో రూ.3,000 కోట్లు వ్యాపారం జరిగిందని కాయిట్ వివరించింది.
ప్రజలు పండుగల పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారని, ప్రతి పండుగకు భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారని కాయిట్ తెలిపింది. కొత్త బట్టలు, వివిధ రకాల అలంకరణ వస్తువులు, పువ్వులు, ఇతర తోరణాలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారని వెల్లడించింది.