ఎవరీ నెవిల్లే టాటా? అకస్మాత్తుగా వార్తల్లోకి ఎందుకు వచ్చారు?
భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ లలో ప్రముఖమైంది టాటా. ఎంపిక చేసుకోవాల్సి వచ్చిన వేళలో
By: Tupaki Desk | 22 Aug 2024 4:14 AM GMTభారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ లలో ప్రముఖమైంది టాటా. ఎంపిక చేసుకోవాల్సి వచ్చిన వేళలో.. ఆ వరుసలో టాటా గ్రూపు ఉత్పత్తులు ఉంటే.. మరో ఆలోచన లేకుండా వాటిని తీసేసుకోవటానికి ఏ మాత్రం సంకోచించని తత్వం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి టాటా గ్రూపులోకి కొత్త తరం ఎంట్రీ ఇచ్చేస్తోంది. కరుగుతున్న కాలానికి తగ్గట్లు.. పెద్ద వయస్కులు బాద్యతల బరువును తగ్గించుకుంటూ ఉంటే.. కొత్త తరం యూత్ ఫుల్ గా ఎంట్రీ ఇస్తోంది.
తాజాగా టాటాలకు చెందిన నెవిల్లే టాటా గ్రూపు కంపెనీల్లో కీలకమైన స్టార్ బాధ్యతలను చేపట్టటం ఆసక్తికరంగా మారింది. ఈ 32 ఏళ్ల కుర్రాడు రతన్ టాటాకు ఏమవుతారు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నెవిల్లే టాటా మరెవరో కాదు.. టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ కుమారుడు. టాటా గ్రూపు.. బ్రిటిష్ రిటైలర్ టెస్కో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ట్రెంట్ లిమిటెడ్. స్టార్ మార్కెట్ తో పాటు వెస్ట్ సైడ్.. జుడియో.. జరా వ్యాపారాల్ని ఈ కంపెనీ చేపట్టిన సంగతి తెలిసిందే.
ట్రెంట్ హైపర్ మార్కెట్ బోర్డులో సభ్యుడిగా ఉన్న నెవిల్లే.. ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు చేపట్టారు. లండన్ లోని బేయెస్ బిజినెస్ స్కూల్లో చదివిన నెవిల్లే.. గడిచిన ఎనిమిదేళ్లుగా ట్రెంట్ లిమిటెడ్ బాధ్యతల్ని చూస్తున్నాడు. మొదట్లో ఫుడ్.. బెవరేజెస్ వ్యాపారాన్ని చూసుకున్న అతను.. ఆ తర్వాత దుస్తులవ్యాపారమైన జుడియో నిర్వహణను చూస్తున్నారు. ఆ తర్వాత కొంతకాలం విదేశాల్లో చదువుకున్న అతను.. తాజాగా స్టార్ మార్కెట్ వ్యాపార బాధ్యతల్ని అందుకున్నారు.
కొద్దికాలంపాటు ఆయనకు అతడి తండ్రి నోయల్ టాటా మార్గదర్శనం చేస్తారని.. త్వరలో సీఈవో లేదంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు చెబుతున్నారు. టాటా గ్రూపులోకి ఇప్పుడు టాటాల యువతరం ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే నోయల్ టాటా కుమార్తెలు యాక్టివ్ గా ఉన్నారు. 39 ఏళ్ల లేహ్ టాటా ఇండియన్ హోటల్స్ విభాగానికి.. 35 ఏళ్ల మాయా టాటా వచ్చేసరికి టాటా డిజిటల్ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఆమె ప్రచారానికి దూరంగా ఉంటారన్న పేరుంది. ఆమె ఎక్కడా ఫోకస్ అయ్యేందుకు ఇష్టపడరని చెబుతుంటారు. తాజాగా టాటా గ్రూప్ కు చెందిన స్టార్ బాధ్యతల్ని 32 ఏళ్ల నెవిల్లే టాటా చేపట్టనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ముగ్గురు టాటాలు నిర్వహించే పలు ట్రస్టులకు ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు.