పతంజలి బాబా రామ్‌దేవ్ రూ.4500 కోట్ల డీల్ వెనక
యోగ గురు రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగిన విధానం ప్రజలకు తెలుసు.
By: Tupaki Desk | 15 March 2025 9:10 AM ISTయోగ గురు రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగిన విధానం ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఈ ఆయుర్వేద ఆధారిత గ్రూప్ ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశిస్తోంది. రజనిగంధ తయారీ సంస్థ ధరంపాల్ సత్యపాల్ గ్రూప్ (డిఎస్ గ్రూప్), సీరం గ్రూప్ అదార్ పూనవాలా యాజమాన్యంలోని సనోటి ప్రాపర్టీస్‌తో రూ.4,500 కోట్ల విలువైన డీల్ ను రామ్ దేవ్ కుదుర్చుకున్నారు.
పతంజలి ఆయుర్వేద్ .. డిఎస్ గ్రూప్ సనోటి ప్రాపర్టీస్ ఎల్‌ఎల్‌పి నుండి మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనుందని జాతీయ మీడియా కథనం వెలువరించింది. తాజాగా ఓ ప్రకటనలో కంపెనీలు దీనిని ధృవీకరించాయి. మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ అనేది సనోటి ప్రాపర్టీస్ ఎల్‌ఎల్‌పి మెజారిటీ యాజమాన్యంలో ఉంది. ఇది అదార్ పూనవల్లా- రైజింగ్ సన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సంస్థ. పతంజలి ఆయుర్వేద్ -డిఎస్ గ్రూప్‌తో వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం.. అదార్ పూనవల్లా యాజమాన్యంలోని సనోటి ప్రాపర్టీస్ దాని బీమా అనుబంధ సంస్థ మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ సంయుక్త సంస్థలన్నీ ఈ అమ్మకానికి ఆమోదం తెలిపాయని ప్రకటన పేర్కొంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ. 4,500 కోట్లు. 12 మార్చి 2025న జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో మాగ్మా హెచ్‌డిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌గా పిలిచేవారు.. మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ వివిధ వర్గాలలో 70 కి పైగా ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. సాధారణ బీమా రంగంలోని అన్ని ప్రధాన కవరేజీలను ఇది అందిస్తుంది.
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు 2,00,000 కౌంటర్లలో, రిలయన్స్ రిటైల్, హైపర్ సిటీ, స్టార్ బజార్ , 250 పతంజలి మెగా స్టోర్‌లు సహా జాతీయ స్థాయి చైన్‌లలో అందుబాటులో ఉన్నందున గ్రామీణ మార్కెట్లకు ఇన్సూరెన్స్ అందుబాటులోకి తేవడం సులువు అవుతుందని పతంజలి ప్రతినిధి తెలిపారు. బలమైన ఏజెంట్ వ్యవస్థ మాగ్మా ఇన్సూరెన్స్ ఎదుగుదలకు సహకరిస్తుందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ అదార్ పూనవల్లా వ్యాఖ్యానించారు. 18000 ఏజెంట్లు, 2000 కార్పొరేట్లు తమ వ్యాపారంతో అనుసంధానమై ఉన్నాయని ఆయన వెల్లడించారు.