రిలయన్స్ హవా ఎంతంటే.. ఫార్చూన్ గ్లోబల్ లో మెరుగైన ర్యాంకు
కార్పొరేట్ ప్రపంచంలో తన సత్తా చాటే విషయంలో రిలయన్స్ అస్సలు తగ్గట్లేదు.
By: Tupaki Desk | 6 Aug 2024 7:30 AM GMTకార్పొరేట్ ప్రపంచంలో తన సత్తా చాటే విషయంలో రిలయన్స్ అస్సలు తగ్గట్లేదు. ఏ రిపోర్టు చూసినా గతం కంటే మరింత మెరుగైన పని తీరును మాత్రమే కాదు.. క్రమం తప్పని విధంగా తన ర్యాంకును మెరుగుపర్చుకోవటమే కాదు.. తనకు తిరుగులేదన్న విషయాన్ని తరచూ స్పష్టం చేస్తోంది. తాజాగా ఫార్చూన్ విడుదల చేసిన గ్లోబల్ 500 జాబితాలో మరో మెరుగైన ర్యాంక్ ను సొంతం చేసుకుంది.
భారతదేశానికి చెందిన కంపెనీల్లో ఈ జాబితాలో తొలిస్థానాన్ని సొంతం చేసుకున్న రిలయన్స్ ప్రపంచ ర్యాంకింగ్ విషయానికి వస్తే.. గత ఏడాదితో పోలిస్తే రెండు స్థానాల్ని మెరుగుపర్చుకుంది. తాజాగా 86వ ర్యాంక్ లో నిలిచింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గడిచిన మూడేళ్లలో రిలయన్స్ ఏకంగా 69 స్థానాలు పైకి రావటం.
2021లో ఇదే జాబితాలో రిలయన్స్ 155వ ర్యాంకులోఉంటే.. తాజాగా 86వ ర్యాంకులో నిలిచింది. గడిచిన 21 ఏళ్లుగా గ్లోబల్ 500 జాబితాలో చోటు దక్కించుకుంటున్న ఆర్ఐఎల్.. గత ఏడాది 108.8 బిలియన్ డాలర్ల ఆదాయంపై 8.4 బిలియన్ డాలర్ల లాభాన్ని సొంతం చేసుకుంది. ఈ జాబితాలో ఈ ఏడాది మొత్తం తొమ్మిది భారత్ కంపెనీలకు చోటు దక్కింది.అందులో ఐదు ప్రభుత్వ రంగానికి చెందినవి కాగా.. నాలుగు మాత్రమే ప్రైవేటు సంస్థలు.
ఈ జాబితాలో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. గడిచిన పదకొండేళ్లుగా ఈ సంస్థ మొదటి స్థానంలో నిలుస్తోంది. అమెజాన్ రెండో స్థానానికి చేరుకోగా.. గత ఏడాది ఈ కంపెనీ నాలుగో స్థానంలో ఉంది. సౌదీ ఆరామ్ కో రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. చైనా ప్రభుత్వ రంగ ఎలక్ట్రిసిటీ యుటిలిటీ సంస్థ స్టేట్ గ్రిడ్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో టాప్ 10లో చైనాకు చెందిన సినోపెక్ గ్రూప్ ఐదో స్థానంలో నిలవగా.. చైనా నేషనల్ పెట్రోలియం 6వ స్థానంలో ఉంది. వీటి తర్వాతే దిగ్గజ సంస్థ యాపిల్ (ఏడో ర్యాంకు) ఉండటం గమనార్హం.
ఫార్చూన్ గ్లోబల్ 500లో చోటు దక్కించుకున్న భారత కంపెనీల్నిచూస్తే..
కంపెనీలు తాజా ర్యాంక్
రిలయన్స్ ఇండస్ట్రీస్ 86
ఎల్ ఐసీ 95
ఐఓసీ 116
ఎస్ బీఐ 178
ఓఎన్ జీసీ 180
బీపీసీఎల్ 258
టాటా మోటార్స్ 271
హెచ్ డీఎఫ్ సీ బ్యాక్ 306
రాజేశ్ ఎక్స్ పోర్ట్స్ 463
ఈ కంపెనీల్లో గత ఏడాది ర్యాంకింగ్ కంటే కిందకు వెళ్లిన కంపెనీల విసయానికి వస్తే ఐఓసీ గత ఏడాది కంటే 22 ర్యాంకుల్ని పోగొట్టుకుంటే.. ఓఎన్ జీసీ 22 ర్యాంకుల్ని.. బీపీసీఎల్ 25 ర్యాంకుల్ని.. రాజేశ్ ఎక్స్ పోర్ట్స్ ఏకంగా 110 స్థానాల్ని తగ్గించుకుంది. గత ఏడాది ఈ జాబితాలో లేని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు తొలిసారి చోటు దక్కించుకుంది.