యాజమాని సంపాదన స్థాయికి చేరిన ఉద్యోగి... ఎవరీ బాల్మర్?
అవును... ఒక సంస్థలో పనిచేస్తూ, ఆ సంస్థ యజమాని సంపాదనకు దాదాపు సమానంగా సంపాదించడం అంటే మామూలు విషయం కాదు.
By: Tupaki Desk | 1 Nov 2023 1:30 PM GMTఎవరైనా ఒక వ్యక్తి ఒక సంస్థలో ఉద్యోగానికి చేరితే... రిటైర్ అయ్యే లోపు మంచి పొజిషన్ కి వెళ్లాలని ఒకప్పుడు అనుకుంటే, వీలైనంత తొందర్లో టాప్ ప్లేస్ కి వెళ్లిపోవాలని నేటి జనరేషన్ భావిస్తుంటుంది. అయితే... స్టీవ్ బాల్మర్ మాత్రం అలా అనుకున్నాడో లేదో తెలియదు కానీ... తాను పనిచేసిన సంస్థ యజమానితో దాదాపు సమానంగా సంపాదనలో చేరువయ్యాడు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది!
అవును... ఒక సంస్థలో పనిచేస్తూ, ఆ సంస్థ యజమాని సంపాదనకు దాదాపు సమానంగా సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల, ప్రణాళిక, సరికొత్త వ్యూహాలు ఎన్నో ఉండాలి! ఈ సమయంలో ఆ ఘనత సాధించాడు మైక్రోసాఫ్ట్ మాజీ సీఇవో స్టీవ్ బాల్మర్. ఇప్పుడు ప్రపంచంలోని రిచ్చెస్ట్ ప్లేస్ లో బిల్ గేట్స్ తర్వాత స్థానంలో ఉన్నాడు!
హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో బిల్ గేట్స్ తో స్టీవ్ బాల్మర్ కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో చదువు పూర్తికాగానే 1980ల్లో బిల్ గేట్స్ కు సహాయకుడిగా మైక్రో సాఫ్ట్ కంపెనీలో అడుగుపెట్టారు బాల్మర్. ఈ క్రమంలో 1998లో సంస్థ ప్రెసిడెంట్ గా, 2000లో సీఈవోగా ఎదిగారు. ఇదే సమయంలో... మైక్రోసాఫ్ట్ సంస్థలో సుమారు 4 శాతం వాటా కూడా సంపాదించారు.
ఈ క్రమంలో తాజాగా బ్లూం బర్గ్ బిలియనీర్ రియల్ టైం జాబితా ప్రకారం బాల్మర్ ప్రపంచంలోనే ఐదో అత్యంత సంపన్నుడిగా మారారు. ప్రస్తుతం ఇతని సంపాదన 117 బిలియన్ డాలర్లు కాగా... 122 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ నాలుగోస్థానంలో ఉండటం గమనార్హం. ఉద్యోగికి సంస్థ ఇచ్చే స్టాక్ ఆప్షన్ తో బిలియనీర్ అయిన రెండో వ్యక్తిగా బాల్మర్ ఘనత సాధించారు. మైక్రోసాఫ్ట్ లాభాల బాటలో ఉండటంతో బాల్మర్ సంపద కూడా పెరుగుతూ వస్తోంది.
ఇక ఈ జాబితాలో 193 బిలియన్ డాలర్లతో ప్రథమ స్థానంలో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉండగా... 156 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్ట్, 156 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
కాగా... 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా పదవీ విరమణ చేసిన స్టీవ్ బాల్మర్... లాస్ ఏంజిలెస్ క్లిప్పర్స్ బాస్కెట్ బాల్ జట్టును కొనుగోలు చేశారు. ఇతని తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల నియమితులైన సంగతి తెలిసిందే.