దేశీయ స్వయంకృషి శ్రీమంతులు.. టాప్ లో ఎవరో తెలుసా?
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకొచ్చిన శ్రీమంతులకు సంబంధించిన ఆసక్తికర రిపోర్టును విడుదలైంది.
By: Tupaki Desk | 19 Dec 2024 5:04 AM GMTఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకొచ్చిన శ్రీమంతులకు సంబంధించిన ఆసక్తికర రిపోర్టును విడుదలైంది. దేశీయంగా టాప్ 200 స్వయంకృషి శ్రీమంతుల జాబితాను ఐడీఎఫ్ సీ ఫస్ట్.. హురున్ ఇండియాలు సంయుక్తంగా విడుదల చేశాయి. ఇందులో ఔత్సాహిక వాణిజ్యవేత్తలు పలువురు ఉన్నారు. వీరిలో టాప్ స్థానంలో నిలిచారు అందరికి సుపరిచితమైన డిమార్టు అధినేత రాధాకిషన్ దమానీ. ఆయన సంపద విలువ అక్షరాల రూ.3.42 లక్షల కోట్లు.
ఇండియాస్ టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఆంత్రప్రెన్యూర్స్ ఆఫ్ ద మిలేనియా 2024 రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ రిపోర్టులో పేర్కొన్న 200 మందిని ఆయా సంస్థల విలువ ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఈ రిపోర్టులో మొదటి స్థానంలో రాధా కిషన్ దమానీ నిలువగా.. రెండో స్థానంలో జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ నిలిచారు. ఆయన నికర సంపద ఏడాదిలో 190 శాతం పెరిగినట్లుగా రిపోర్టు వెల్లడించింది.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న టాప్ 10 మందిలో.. ఈ ఏడాది వ్యవధిలో 100శాతానికి పైగా సంపద విలువ పెంచుకున్న వారు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు మేక్ మైట్రిప్ 168 శాతం కాగా.. పాలసీ బజార్ 128 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో మేక్ మై ట్రిప్ అధిపతులు కొత్తగా జాబితాలో చేరటమే కాదు.. నాలుగో స్థానాన్ని సొంతం చేసుకోవటం గమనార్హం.
ఫుడ్ ఆర్డర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే స్విగ్గీ సహ వ్యవస్థాపకులు తెలుగోడైన శ్రీహర్ష మాజేటి.. నందన్ రెడ్డిలు 52 శాతం వ్రద్ధి రేటుతో రూ.లక్ష కోట్ల విలువను చేజిక్కించుకున్నారు. జాబితాలో అతి పిన్న వయస్కుడిగా జెప్టో వ్యవస్థాపకులు కైవల్య ఓహ్రా నిలిచారు. అతడి వయసు 21 ఏళ్లు మాత్రమే. జెప్టో విలువ 259 శాతం పెరిగి.. రూ.41,800 కోట్లకు చేరింది. ఆయన తర్వాత జెప్టోకే చెందిన 22 ఏళ్ల ఆదిత్ పలిచా.. భారత్ పే వ్యవస్థాపకులు శాశ్వత్ నక్రానీ (26) నిలిచారు. జాబితాలోని వారి సగటు వయసు 45 ఏళ్లుగా ఉంది. జాబితాలో చోటు దక్కించుకున్న 200 కంపెనీల విలువ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 20 శాతం పెరిగింది. సంపద రూ.36 లక్షల కోట్లకు చేరటం గమనార్హం.
జాబితాలో నిలిచిన 200 కంపెనీల్లో 94 శాతం మంది విదేశీ మదుపర్ల సాయాన్ని తీసుకున్నారు. మిగిలిన వారు మాత్రం దేశీయంగా.. సొంత నిధులతోనే ఈ స్థాయికి చేరారు. 200 కంపెనీల్లో కేవలం 32 శాతం కంపెనీలు మాత్రమే స్టాక్ మార్కెట్ లో నమోదయ్యారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. 200 కంపెనీల్లో 79 కంపెనీలకు చెందిన 124 మంది హురున్ ఇండియాకుబేర జాబితాలోనూ కనిపించారు. కానీ.. వీరిలో దాత్రత్వ జాబితా 2023లో చూస్తే.. ప్రస్తుతం ఉన్న వారిలో ఏడుగురు మాత్రమే ఉన్నారు. అంటే.. వీరిలో దానగుణం తక్కువన్న విషయం అర్థమవుతుంది.
టాప్ 200 కంపెనీల జాబితాలో బెంగళూరులో రిజిస్టర్ చేసిన కంపెనీలు 66 కాగా.. తర్వాతిస్థానంలో ముంబయి (36).. గురుగ్రామ్ (31).. ఢిల్లీ (15).. చెన్నై (12).. పుణె (7).. హైదరాబాద్ (6) నిలిచాయి. జాబితాలో చోటు దక్కించుకున్న విద్యార్హతల్ని చూస్తే.. 51 శాతం మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లే. మరీ ముఖ్యంగా ఐఐటీ ఢిల్లీ నుంచి 36 మంది ఉన్నారు. ఇతర ఐఐటీల నుంచి 81 మంది ఉన్నారు. బిట్స్ పిలానీ నుంచి ఏడుగురు ఉన్నారు.
జాబితాలో నిలిచిన వారిలో తమ పీజీను ఐఐఎం.. ఐఎస్ బీ.. ఐఐటీ.. హార్వర్డ్.. స్టాన్ ఫోర్డ్ ల్లో చేసిన వారు 78 మంది ఉన్నారు. జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 13 మంది చార్టర్డ్ అకౌంటెంట్లు.. ఏడుగురు డాక్టర్లు ఉన్నారు. ఐఎస్ బీలో చదివిన వారిలో పది మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ మొత్తం జాబితాలో 19 మంది మహిళలు ఉన్నారు. ఈ కంపెనీల కారణంగా 10 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. జాబితాలో నిలిచిన కంపెనీ్లో 10 ఏళ్ల లోపు స్టార్ట్ అయిన కంపెనీలు 97. వీటి మొత్తం విలువ రూ.11 లక్షల కోట్లు.
జాబితాలో టాప్ 10 మంది వీరే..
ర్యాంకు వ్యవస్థపాకులు కంపెనీ - విలువ (కోట్లు)
01 రాధాకిషన్ దమానీ డీమార్టు 3.42లక్షలు
02 దీపిందర్ గోయల్ జొమాటో 2.51 లక్షలు
03 శ్రీహర్ష.. నందన్ స్విగ్గీ 1.01 లక్షలు
04 దీప్.. రాజేశ్ మేక్ మై ట్రిప్ 99వేలు
05 అభయ్ సాయ్ మాక్స్ హెల్త్ కేర్ 96 వేలు
06 యశీశ్.. అలోక్ పాలసీ బజార్ 78 వేలు
07 భవిత్.. హర్ష్ డ్రీమ్ 11 66.5 వేలు
08 నితిన్..నిఖిల్ జెరోధా 64.8 వేలు
09 హర్షిల్.. శశాంక్ రేజర్ పే 62.4 వేలు
10 ఫల్గుణి నాయర్ నైకా 56.6 వేలు