వ్యాపారంలో మోసపోయిన 'రక్త చరిత్ర' హీరో
ఎంఐడీసీ పోలీసులు బుధవారం నాడు ఒబేరాయ్ కంపెనీ భాగస్వాములపై చీటింగ్ కేసు నమోదు చేశారు
By: Tupaki Desk | 22 July 2023 4:14 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ రక్తచరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. అతడి అసమాన నట ప్రతిభకు ఇక్కడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఒబెరాయ్ పలు దక్షిణాది చిత్రాల్లో విలన్ గాను నటించారు. అజిత్ వివేగంలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించగా ఆ సినిమా తెలుగులో వివేకం పేరుతో విడుదలైంది. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ తో ప్రేమాయణం సాగించిన హీరోగా ఒబేరాయ్ పేరు మార్మోగింది.
ఇప్పుడు అతడు రకరకాల కారణాలతో మరోసారి మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చారు. తనను వ్యాపార భాగస్వాములు మోసం చేసారంటూ ఒబెరాయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఒబెరాయ్ అతని భార్య ప్రియాంక కనీసం ముగ్గురు వ్యాపార భాగస్వాములపై ₹1.55 కోట్లు మోసం చేశారంటూ కేసును దాఖలు చేశారు. ఘనమైన లాభాలొస్తాయంటూ ఓ ఈవెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టగా వాటిని స్వలాభాల కోసం భాగస్వాములు దుర్వినియోగం చేసారని ఒబేరాయ్ కుటుంబం ఫిర్యాదు చేసింది.
ఈ ఆరోపణల ఆధారంగా ఎంఐడీసీ పోలీసులు బుధవారం నాడు ఒబేరాయ్ కంపెనీ భాగస్వాములపై చీటింగ్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో సినీ నిర్మాతలు.. ఈవెంట్ నిర్వాహకులు సంజయ్ సాహా అతని తల్లి నందితా సాహా.. రాధిక నంద ఉన్నారు.
నటుడు ఒబేరాయ్ అతని భార్య తరపున వారి అకౌంటెంట్ దేవెన్ బఫ్నా వారిపై ఫిర్యాదు చేశారు. ఇరు పార్టీలు సినిమా వ్యాపారంతో పాటు సినిమా నిర్మాణానికి సంబంధించిన ఈవెంట్ లను నిర్వహించడంలో ప్రత్యేకత కలిగిన ఈవెంట్స్ కంపెనీని ప్రారంభించాల్సి ఉందని బఫ్నా పోలీసులకు చెప్పారు.
''ఒబెరాయ్ లు 2017లో ఒబెరాయ్ ఆర్గానిక్స్ పేరుతో ఒక కంపెనీని ప్రారంభించారు. అది సరిగా వర్కవుట్ కాకపోవడంతో వారు మొదట ఆ ముగ్గురిని సంస్థలో భాగస్వాములుగా చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఆ వ్యాపారాన్ని రద్దు చేసి ఆనందిత ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఈవెంట్స్ వ్యాపారంగా మార్చాలని నిర్ణయించుకున్నారు'' అని బఫ్నా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఈ ఒప్పందం 2020 జూలైలో రెండు పార్టీల మధ్య కుదిరిందని ఆయన చెప్పారు.
జాయింట్ వెంచర్ ఒప్పందంలో రోజువారీ పనిని సంజయ్ సాహా - రాధిక నందా చూసుకోవాలని వివరంగా ఉంది. దానివల్ల సమస్యలొచ్చాయి. ''ఏప్రిల్ 2022లో ఒక ఉద్యోగి వెంచర్ లోని నిధులను తప్పు దారి పట్టించడం గురించి ఒబెరాయ్ కు సమాచారం అందించారు.
ఆ తర్వాత సమస్యలను పరిష్కరించడానికి బఫ్నాను సాయం కోరారు. వ్యాపార భాగస్వాముల్లో ఒకరైన సంజయ్ సాహా తన తల్లికి జీవిత బీమా ప్రీమియం చెల్లించడంతోపాటు వివిధ వ్యక్తిగత కారణాల కోసం కంపెనీ డబ్బును ఉపయోగించాడని అతను కనుగొన్నాడు. నందా కూడా కంపెనీ నుండి డబ్బును విత్ డ్రా చేసుకున్నాడు'' అని MIDC పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఖాతా స్టేట్ మెంట్ ల ప్రకారం ఇద్దరు భాగస్వాములు రూ.58 లక్షలకు పైగా స్వాహా చేసినట్లు ఆయన తెలిపారు. మోసం బయటపడ్డాక ఒబెరాయ్ తన భాగస్వాములతో తలపడ్డాడు. ఒబెరాయ్ తన వ్యక్తిగత ఖాతాల నుండి మాయమైన రూ.51 లక్షల గురించి ప్రశ్నించారు. అలాగే నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని మోసం చేశారని ఆరోపించబడిన మరో మోసం గురించి వివరణ ఇవ్వాల్సిందిగా కూడా వారిని కోరాడు. ''మేము నిందితులపై IPC సెక్షన్లు 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన).. 409 (నిజాయితీ లేని దుర్వినియోగం) .. 420 (మోసం) కింద కేసు నమోదు చేసాము'' అని ఒక పోలీసు అధికారి తెలిపారు.