Begin typing your search above and press return to search.

ఏమిటీ గోల్డ్ బాండ్? ఎలా కొనాలి? లాభమేనా?

చాలామంది భవిష్యత్తు పొదుపులో భాగంగా.. ఫ్యూచర్ ఇన్ వెస్ట్ మెంట్ గా దాన్ని భావిస్తారు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 5:17 AM GMT
ఏమిటీ గోల్డ్ బాండ్? ఎలా కొనాలి? లాభమేనా?
X

గోల్డ్ బాండ్ మళ్లీ వచ్చేసింది. దేశీయంగా ఆదరణ పొందిన గోల్డ్ బాండ్లు మరోసారి సబ్ స్క్రిప్షన్ కు రానున్న సంగతి తెలిసిందే. తొలిసారి ఈ ఏడాది జూన్ లో రాగా.. రెండో విడత బాండ్లను సెప్టెంబరులో జారీ చేశారు. ఇప్పుడు మూడోసారి విడుదల చేయనున్నారు.ఈ నెల 18 అంటే సోమవారం నుంచి ఐదు రోజుల పాటు సబ్ స్క్రిప్షన్ పొందే వీలుంది. ఇంతకూ ఈ గోల్డ్ బాండ్ల సబ్ స్క్రిప్షన్ ఏమిటి? దాన్లో ఎలా మదుపు చేస్తారు? ఇందులో పెట్టుబడి పెట్టటం వల్ల వచ్చే లాభమేంటి? దీని వల్ల వచ్చే ఆదాయం ఎంత ఉంటుంది? ఇది భద్రమైనదేనా? లాంటి సందేహాలు పలువురిలో ఉంటాయి. వాటి వివరాల్లోకి వెళితే..

బంగారు బాండ్లను విడుదల చేస్తున్నది బంగారాన్ని కొనుగోలు చేసే అలవాటును తగ్గించాలనే. చాలామంది భవిష్యత్తు పొదుపులో భాగంగా.. ఫ్యూచర్ ఇన్ వెస్ట్ మెంట్ గా దాన్ని భావిస్తారు. పలువురు ఆభరణాల్ని కొనుగోలు చేస్తారు. ఏదైనా ఆర్థిక సమస్య ఎదురైతే బంగారం అక్కరకు వస్తుందని ఆశిస్తారు. మరికొందర.. గ్రాముల లెక్కన కొనుగోలు చేసి.. కొంత బంగారం సమకూరిన తర్వాత తమకు నచ్చిన ఆభరణాల్ని చేసుకోవటం కనిపిస్తుంది.

ఇలాంటి వారికి తాజా గోల్డ్ బాండ్లు చక్కటి అవకాశంగా చెప్పాలి. గోల్డ్ బాండ్ల సబ్ స్క్రిప్షన్ ను 2015 నవంబరులో తీసుకొచ్చారు. సబ్ స్క్రిప్షన్ కు ముందు అంతకు ముందు వారం చివరి మూడు పని దినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఏ ధర ఉంటుందో దాని సగటు ఆధారంగా గ్రాము బంగారాన్ని అందిస్తారు. తాజాగా ఒక గ్రాము బంగారాన్ని రూ.6199గా నిర్ణయించారు. ఆన్ లైన లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఇస్తారు. అంటే.. ఒక పసిడి బాండ్ ఇష్యూ ధర రూ.6149 అన్న మాట.

ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టాలంటే కనిష్ఠంగా ఒక గ్రాము కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా ఒక వ్యక్తి 4 కేజీల బంగారాన్ని కొనుగోలు చేసే వీలుంది. అదే ట్రస్టులు అయితే 20కేజీల వరకు కొనే వీలుంది. బాండ్ జీవన కాలం 8 సంవత్సరాలు. ఈ గడువు ముగిసిన తర్వాత అప్పటికి ఎంత ధర ఉంటుందో.. ఆ ధరను చెల్లిస్తారు. 8 ఏళ్ల వరకు కాదు.. 5 ఏళ్లకు ఏదైనా అవసరం వస్తే అంటే? అలా కూడా బయటకు రావొచ్చు. మరి.. ఈ బాండ్లను కొనుగోలు చేయటం ఎలా? అన్న ప్రశ్నకు సమాధానం చూస్తే.. చాలా తేలిగ్గా కొనుగోలు చేసే వీలుంది.

గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్జైంజీల ద్వారా కానీ.. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు.. పోస్టాఫీసులు.. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. క్లియరింగ్ కొర్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఇలా వేర్వేరు వేదికల్లో మీకు నచ్చిన దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మైనర్లు సహా ఎవరైనా వీటిని కొనుగోలు చేయొచ్చు. కాకుంటే.. మైనర్ల పేరుతో కొనాలంటే ఎవరైనా మేజర్లతో కలిసి జాయింట్ కొనుగోలు చేయొచ్చు. దీనిపై వడ్డీ.. బాండ్ ను ఇష్యూ చేసిన తేదీ నుంచి ప్రారంభమవుతుంది. బాండ్ నామమాత్రపు విలువపై ఏడాదికి 2.5 శాతం ఫిక్సెడ్ రేటుతో ఆర్నెల్లకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ముందే చెప్పినట్లుగా బాండ్ 8 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది.

బాండ్ల గడువు ముగిసే సమయానికి వచ్చే లాభం మీద పన్ను మినహాయింపు ఉంటుంది. మూడేళ్ల ముందు బాండ్లను అమ్మేస్తే.. స్వల్పకాలిక మూలధన లాభాల కింద వర్తించే పన్ను శ్లాబుప్రకారం పన్నును చెల్లించాల్సి ఉంటుంది. 36 నెలల తర్వాత అంటే.. మూడేళ్ల తర్వాత బదిలీ చేస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల కింద ఇండెక్సేషన్ తర్వాత 20 వాతం పన్ను వర్తిస్తుంది. మరి.. వీటిని కొంటే లాభమా? అంటే అవునని చెబుతారు. ఎందుకంటే.. సాధారణంగా బంగారాన్ని కొనుగోలు చేస్తే.. జీఎస్టీ.. మేకింగ్ ఛార్జిలు.. అదనపు ఛార్జీలు లాంటివి ఏమీ ఉండవు. అందుకే..అదనపు ఖర్చుల ఉండవు. దొంగలిస్తారన్న భయం ఉండదు. బంగారంలో పెట్టుబడి పెట్టే వారు గోల్డ్ బాండ్లు చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు. చివరగా.. మేం మీకు సమాచారాన్ని మాత్రమే ఇస్తున్నాం. మేం వీటిని కొనుగోలు చేయాలని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చెప్పట్లేదు. మీకున్న విచక్షణతో మాత్రమే కొనుగోలు చేయగలరు. మీ లాభనష్టాలకు మేం ఎలాంటి బాధ్యత తీసుకోమన్నది దయచేసి మర్చిపోవద్దు.