Begin typing your search above and press return to search.

సంచలన కేసుల్లోనూ ఇంత జాప్యమా చంద్రబాబు?

పాలనలో పరుగులు పెట్టించే సామర్థ్యం చంద్రబాబుకు ఉందన్న మాట తరచూ చెబుతుంటారు.

By:  Tupaki Desk   |   31 March 2025 5:15 AM
సంచలన కేసుల్లోనూ ఇంత జాప్యమా చంద్రబాబు?
X

పాలనలో పరుగులు పెట్టించే సామర్థ్యం చంద్రబాబుకు ఉందన్న మాట తరచూ చెబుతుంటారు. ఇప్పుడైతే తనను తాను ముఖ్యమంత్రిగా అభివర్ణించుకుంటున్నారు కానీ.. గతంలో ఆయన తాను సీఎం అనే కంటే సీఈవో అనిపించుకునేందుకే ఇష్టపడేవారు. కాలం తెచ్చిన మార్పుల్లో చంద్రబాబు సీఈవోను వదిలేసి సీఎం పోలికకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది. పాలన పరంగా చంద్రబాబు సామర్థ్యాన్ని పక్కన పెడితే.. సంచలన నేరాలు.. అనుమనాస్పద మరణాల విషయంలో ఎలా డీల్ చేయాలన్న దానిపై చంద్రబాబు ఇప్పటికి క్లారిటీ లేదా? అన్నది ప్రశ్న.

2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2019 ఎన్నికలకు కాస్త ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసును ఆయన ప్రభుత్వం ఎలా డీల్ చేసిందో తెలిసిందే. క్లియర్ కట్ హత్య కేసుకు సంబంధించిన విచారణ దూకుడుగా చేపట్టి.. వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టే అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోవటం కనిపిస్తుంది. వైఎస్ వివేకా హత్య కేసులో జరిగింది ఇదన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పే విషయంలో ప్రదర్శించిన తడబాటుతో జరిగిన డ్యామేజ్ గురించి తెలిసిందే.

తాను ప్రతిపక్షంలో ఉన్న వేళలో వైఎస్ వివేకా హత్య అంశంపై ఎన్నిసార్లు మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది? చేతిలో అధికారంలో ఉన్నప్పుడు పోలీసు విచారణకు వేగవంతంగా చేసి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది. మొత్తంగా వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి.. హత్య జరిగిన సమయంలో చంద్రబాబు ప్రభుత్వ స్టాండ్.. ఆ తర్వాత వినిపించిన వాదనలోని వైరుధ్యం గురించి తెలిసిందే. ఆచితూచి అన్నట్లుగా ప్రదర్శించిన తీరుతో చంద్రబాబుకు నష్టమే జరిగిందన్నది మర్చిపోకూడదు.

కట్ చేస్తే.. తాజాగా తెలంగాణకు చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మరణం విషయంలోనూ తడబాటు కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ప్రకటనలకు ధీటుగా.. పోలీసుల విచారణ సాగటం ప్రభుత్వానికి డ్యామేజ్ గా మారుతోంది. రోడ్డు ప్రమాదం జరిగి.. గాయాలైన ప్రవీణ్ కుమార్ ఆ తర్వాత మరణించారా? అన్నది తేల్లేదు. కాకుంటే.. విజయవాడలో దాదాపు మూడు గంటలు ఉండిపోవటం.. ఆ టైంలో ఎక్కడ ఉన్నారన్న విషయంపై క్లారిటీ రావటానికి దాదాపు వారం టైం పట్టింది.

ఈ వారంలో చంద్రబాబు ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు.. ప్రవీణ్ కుమార్ మరణంపై వ్యక్తం చేసిన అనుమానాలు. చేసిన ఆరోపణల్ని చూసినప్పుడు.. అప్పట్లో వివేకా హత్య కేసు విషయంలోనూ ఇలాంటి నెమ్మదితనమే కొంప ముంచిదన్నది మర్చిపోకూడదు. వారం తర్వాత వెలుగు చేసిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ సీసీ ఫుటేజ్ ను దుర్ఘటన జరిగిన రెండు రోజులకే ఎందుకు బయట పెట్టలేకపోయారు? సంచలన మరణాలు.. భావోద్వేగాల్ని రగిలిచ్చే అవకాశం ఉన్న మరణాల విషయంలో పోలీసు విచారణను వేగంగా చేయించటం ద్వారా.. తప్పుడు ప్రచారాల్ని కట్టడి చేసినట్లు అవుతుంది. వైఎస్ వివేకా హత్య కేసులోనూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో సాగిన విచారణ తీరులోనే ప్రవీణ్ కుమార్ ఉదంతంలోనూ స్పష్టమైన ప్రకటనకు రోజులు రోజులు గడిపేయటం చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందన్న మాట వినిపిస్తోంది.