Begin typing your search above and press return to search.

అత్యాచారం కేసులో టీ కాంగ్రెస్ నేతకు బెంగళూరు పోలీసులు నోటీసులు!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతకు బెంగళూరు పోలీసులు అత్యాచార కేసుకు సంబంధించిన నోటీసులు తాజాగా జారీ చేశారు.

By:  Tupaki Desk   |   4 Sep 2023 4:24 AM GMT
అత్యాచారం కేసులో టీ కాంగ్రెస్ నేతకు బెంగళూరు పోలీసులు నోటీసులు!
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతకు బెంగళూరు పోలీసులు అత్యాచార కేసుకు సంబంధించిన నోటీసులు తాజాగా జారీ చేశారు. ఈ ఉదంతం కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది. ఇంతకీ నోటీసులు అందుకున్నది ఎవరు? ఆయనపై ఉన్న ఆరోపణలు ఏమిటి? అన్నది చూస్తే.. నారాయణపేట కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డిపై బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

తనకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ను ఇచ్చి.. తాను మత్తులో ఉన్నప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ఒకరు కబ్బన్ పార్కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే.. స్టేషన్ కు వచ్చి హాజరయ్యేందుకు తనకు వారం రోజుల గడువు ఇవ్వాలని కోరారు.

ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏమంటే.. గత ఏడాది ఇదే ఆరోపణలతో పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో శివకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఐపీసీ 417, 420, 376, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ ఫిర్యాదును చూస్తే.. 2020లో తనకు శివకుమార్ రెడ్డితో పరిచయమైందని.. దుబ్బాక ఎన్నికల సమయంలో తనపై అత్యాచార యత్నం చేశారని పేర్కొన్నారు. 2021 జూన్ 24న ఒక హోటల్ లో తన మెడలో పసుపుతాడు కట్టి.. అత్యాచారానికి పాల్పడినట్లుగా పేర్కొన్నారు.

హైదరాబాద్ లోని బేగంపేట.. బెంగళూరులోని హోటళ్లకు తనను తీసుకెళ్లి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ను ఇచ్చి తాను స్ప్రహలో లేనప్పుడు అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపించారు. దీనికి సంబంధించిన కేసు విచారణలో సరైన వివరాలు లేని కారణంగా శివకుమార్ పై పెట్టిన కేసును కొట్టేయగా.. తాజాగా బెంగళూరు పోలీసులు నోటీసులు అందాయి. తాజా పరిణామాలపై శివకుమార్ రెడ్డి ఇప్పటివరకు స్పందించలేదు.