Begin typing your search above and press return to search.

దేశంలోనే అతి భారీ సైబర్ నేరం హైదరాబాద్ లో.. బాధితుడు ఎవరంటే?

అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాల తీవ్రత ఎంతన్న దానికి నిదర్శనంగా తాజాగా వెలుగు చూసిన భారీ మోసం షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   5 Sep 2024 5:03 AM GMT
దేశంలోనే అతి భారీ సైబర్ నేరం హైదరాబాద్ లో.. బాధితుడు ఎవరంటే?
X

అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాల తీవ్రత ఎంతన్న దానికి నిదర్శనంగా తాజాగా వెలుగు చూసిన భారీ మోసం షాకింగ్ గా మారింది. దేశంలోనే అతి పెద్ద సైబర్ నేరంగా పోలీసులు పేర్కొంటున్నారు. ఒక ఉదంతంలో బాధితుడి నుంచి సైబర్ మోసగాళ్లు రూ.13.26 కోట్ల భారీ మొత్తాన్ని కొల్లగొట్టిన వైనం పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది. ఇంత భారీ మొత్తంలో మోసం పోవటం దేశంలోనే ఇది తొలిసారి అని చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఒక బాధితుడు రూ.8.6 కోట్ల భారీ మొత్తాన్ని మోసపోగా.. తాజా ఉదంతం దాన్ని అధిగమించేలా ఉంది.

హైదరాబాద్ కు చెందిన రిటైర్డు ఉద్యోగి వాట్సప్ నకు ఆన్ లైన్ స్టాక్ బ్రోకింగ్ చిట్కాల పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. గతంలో షేర్లలో లాభాలు గడించిన అనుభవం ఉన్న బాధితుడు వెంటనే.. ఈ మెసేజ్ కు స్పందించాడు. దీనికి ప్రతిగా పలు కంపెనీల పేర్లతో ఉన్న లింకుల్ని పంపి వాట్సప్ గ్రూపుల్లో చేర్చారు. అవన్నీప్రముఖ కంపెనీలే కావటంతో బాధితుడికి ఎలాంటి అనుమానాలు రాలేదు. అయితే.. అవన్నీ నకిలీ వెబ్ సైట్ల యాఆర్ఎల్స్ .. యాప్ లింకులుగా బాధితుడు గుర్తించలేదు. దీంతో..తీవ్రంగా మోసపోయారు.

ఆయా కంపెనీల ప్రతినిదులుగా పరిచయం చేసుకున్న మోసగాళ్లు.. బాధితుడికి షేర్ల గురించి వివరించారు. వాటిల్లో పెట్టుబడి పెట్టేందుకు పెద్ద వయస్కుడు ఆసక్తి చూపటంతో పలు బ్యాంకు ఖాతా నంబర్లనుపంపి.. నగదు బదిలీ చేయాలని కోరారు. షేర్లలో అతడు పెట్టిన పెట్టుబడికి తొలుత లాభాలు చూపించారు. ఆ డబ్బును వెనక్కి తీసుకున్న బాధితుడు.. ఈసారి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రూ.13.26 కోట్ల ను వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత నుంచి వారు స్పందించటం మానేయటంతో తాను మోసపోయినట్లుగా గుర్తించిన బాధితుడు ఈ నెల 2న సైబర్ సెక్యూరిటీ బ్యూరో కు కంప్లైంట్ చేశారు.

దర్యాప్తులో భాగంగా నిందితుల్ని గుర్తించే క్రమంలో హిమాయత్ నగర్ నివాసి అయిన మెట్రోరైల్ ఉద్యోగి మహ్మద్ అతీర్ పాషా బ్యాంక్ ఖాతాకు కొంత సొమ్ము బదిలీ అయినట్లుగా గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నాడు. విచారణలో మరో ఇద్దరు యువకుల పాత్ర బయటకు వచ్చింది. హిమాయత్ నగర్ కు చెందిన 25 ఏళ్ల అరాఫత్ ఖాలేద్ మొహియుద్దీన్.. చార్మినార్ కు చెందిన 24 ఏళ్ల సయ్యద్ ఖాజా హషీముద్దీన్ లు తనకు బ్యాంక్ ఖాతా తెరిపించినట్లుగా పేర్కొన్నారు. కమిషన్ కోసం తాను బ్యాంక్ ఖాతా తెరిచినట్లుగా పేర్కొన్నారు. ఈ సమాచారంతో వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. వీరందరిని ఆడించిన రింగ్ మాష్టర్ ఎవరన్న విషయాన్ని మాత్రం పోలీసులు గుర్తించలేదు. తమ బ్యాంక్ ఖాతాల్లోపడే సొమ్ముల్ని క్రిప్టో కరెన్సీలోకి మార్చి ప్రధాన నిందితుడికి పంపినట్లుగా గుర్తించారు. తాజాగా ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. అసలు మాయగాడ్ని ట్రేస్ చేయాలసి ఉంది.