బాలీవుడ్ కమెడియన్ ను ట్రాప్ చేసిన సైబర్ నేరగాళ్లు
బాలీవుడ్ హాస్యనటుడు రాకేశ్ బేడీకి ఫుణేలో ఒక ఇల్లుంది. దాన్ని అమ్మేయాలన్న ఆలోచనతో ఒక హౌసింగ్ పోర్టల్ లో ఇంటికి సంబంధించిన వివరాల్ని ఆయన ఉంచారు.
By: Tupaki Desk | 3 Jan 2024 5:45 AM GMTసైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు బాలీవుడ్ హాస్య నటుడు ఒకరు. ఏ అవకాశాన్ని జారవిడవకుండా.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా తమ ట్రాప్ లో పడే ప్రతి ఒక్కరిని నిలువు దోపిడీకి పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల మోసాలు ఏ స్థాయిలో ఉంటాయన్నది తాజా ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు. బాలీవుడ్ కమెడియన్ రాకేశ్ బేడీని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. అతడ్ని మాటలతో వంచించి అతడి నుంచి రూ.80వేలు లాగేశారు. ఇంతకూ ఆ మోసం ఎలా జరిగిందన్న విషయంలోకి వెళితే..
బాలీవుడ్ హాస్యనటుడు రాకేశ్ బేడీకి ఫుణేలో ఒక ఇల్లుంది. దాన్ని అమ్మేయాలన్న ఆలోచనతో ఒక హౌసింగ్ పోర్టల్ లో ఇంటికి సంబంధించిన వివరాల్ని ఆయన ఉంచారు. రోజు తర్వాత ఒక సైబర్ నేరగాడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తనను తాను ఆర్మీ ఆఫీసర్ గా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తిని రాకేశ్ బేడీ నమ్మేశారు. ఎందుకంటే.. గతంలో తనకు చెందిన మరో ఇంటిని ఆర్మీ అధికారికి అమ్మేయటంతో ఈసారి ఫోన్ చేసింది నిజంగానే ఆర్మీ అధికారిగా ఆయన నమ్మారు.
అంతేకాదు.. ఫోన్ చేసిన వ్యక్తి మాటలు సైతం ఆర్మీ అధికారి మాదిరే ఉండటంతో త్వరగా నమ్మేశారు. మాటలతో.. రాకేశ్ ఇంటిని కొంటానని చెప్పిన సైబర్ నేరస్తుడు.. తన క్రైం ప్లాన్ ను అమలు చేశాడు. ఇంటిని కొనుగోలు చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు చెప్పి.. రూ.లక్ష అడ్వాన్స్ గా ఇవ్వనున్నట్లు చెప్పారు. రాకేశ్ నుంచి బ్యాంకు వివరాల్ని తీసుకున్నాడు. ఫండ్ ట్రాన్స్ ఫర్ చేసేందుకు కొన్ని సమస్యలు వచ్చాయని.. రాకేశ్ సతీమణి బ్యాంకు వివరాల్ని కూడా పంపాలని కోరారు. దీనికి స్పందించిన ఆయన అలానే చేశారు.
ఎక్కువ మొత్తం నగదును ఆన్ లైన్ లో ట్రాన్సఫర్ చేస్తే ఒక మెసేజ్ వస్తుందని.. దాన్ని యాక్సెప్ట్చేయాలని.. అప్పుడే డబ్బులు అకౌంట్లోకి వస్తాయని నమ్మించాడు. అతడు చెప్పినట్లే రాకేశ్ బేడీ చేశారు. డబ్బులు జమ కావటం తర్వాత.. బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.50వేలు మాయం అయ్యాయి. దీంతో.. తనకు ఫోన్ చేసిన వ్యక్తిని సంప్రదించిన రాకేశ్.. తన బ్యాంక్ ఖాతాలో డబ్బులు కట్ కావటాన్ని చెప్పారు. ఏదో పొరపాటు జరిగిందని.. తన అకౌంట్ కు మరో రూ.30వేలు పంపాలన్నారు. ఆ మాటను నమ్మిన రాకేశ్ మరో రూ.30వేలు బదిలీ చేశాడు. ఆ తర్వాత నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. అతడి నుంచి సమాధానం రాని పరిస్థితి.
కాసేపటికే అతడి ఫోన్ స్విచ్ఛాప్ అయ్యింది. దీంతో తాను మోసపోయినట్లుగా అర్థమైన ఆయన పోలీసుల్ని సంప్రదించారు. ఆర్మీ అధికారిగా నమ్మించి మోసం చేసిన తీరుపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. తనలా మోసపోవద్దని.. సైబర్ నేరగాళ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు. కారణం ఏమైనా.. ఆన్ లైన్ లో నగదు బదిలీ చేసే వేళలో.. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది మర్చిపోకూడదు.