క్యాబ్ డ్రైవర్ ముందే అన్నీ మాట్లాడేసింది.. చివరికి..!
ఈ నేపథ్యంలో ఆమెకు వేరొక వ్యక్తిలా ఫోన్ చేసి మాట్లాడుతూ.. ఆమె లైఫ్ సీక్రెట్స్ ని బయటపెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.
By: Tupaki Desk | 3 Aug 2023 4:30 PM GMTపొరపాటున ఆటోల్లోనో, క్యాబ్స్ లోనో ఏదైనా విలువైన వస్తువులు, నగదు మరిచిపోయినప్పుడు ఫోన్ చేసి అందించే డ్రైవర్లు ఉంటారు. మరికొంతమంది ఆ నగదు, వస్తువుల ను స్థానిక పోలీస్ స్టేషన్ లలో అప్పగిస్తుంటారు. ఇలాంటి డ్రైవర్ల మధ్య ఇంకోరకమైన డ్రైవర్ కూడా ఉన్నాడు. తన క్యాబ్ లో రెగ్యులర్ గా ప్రయాణించే మహిళను బ్లాక్ మెయిల్ చేశాడు.
అవును... తన క్యాబ్ లో రెగ్యులర్ గా ప్రయాణించే ఓ మహిళా ఉద్యోగి ఫోన్ లో మాట్లాడే వ్యక్తిగత విషయాలను విన్న డ్రైవర్.. ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. వేరే నెంబర్ నుంచి ఆమెకు ఫోన్ చేశాడు. వివరాలు బయటపెడతానంటూ బెదిరించాడు. భారీమొత్తం లో నగదు, నగలు తీసుకున్నాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూరు లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి (35).. తన క్యాబ్ లో తరచూ ఉద్యోగ రీత్యా ప్రయాణిస్తున్న మహిళ ఫోన్ లో మాట్లాడుతున్న సమాచారాన్ని జాగ్రత్తగా గమనించాడు. ఆమె తరచూ అతని క్యాబ్ లోనే వెళుతుండటంతో ఆమె ఫోన్ నంబర్ కూడా తీసుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఆమెకు వేరొక వ్యక్తిలా ఫోన్ చేసి మాట్లాడుతూ.. ఆమె లైఫ్ సీక్రెట్స్ ని బయటపెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. ఫలితంగా.. ఆమె నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. ఈ సమయం లో ఆమె దశలవారీగా సుమారు రూ.20 లక్షల నగదు ను అతని బ్యాంకు ఖాతాలో వేసింది.
ఈ క్రమంలో... తనను బెదిరిస్తున్నది క్యాబ్ డ్రైవరే అన్న విషయం గుర్తించిన మహిళ.. అతన్ని గట్టిగా నిలదీసి హెచ్చరించింది. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ క్యాబ్ డ్రైవర్ ఇప్పుడు నిజంగానే రహస్యాలన్నీ అందరికీ చెప్పేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆమె తన వద్ద ఉన్న 960 గ్రాముల బంగారాన్ని అతనికి ఇచ్చేసింది.
అయినప్పటికీ అతను ఇంకా బెదిరింపులు కొనసాగిస్తుండటంతో విసిగిపోయింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో... అతను వివిధ చోట్ల తాకట్టుపెట్టిన నగలను స్వాధీనం చేసుకున్నారు.