Begin typing your search above and press return to search.

ఏడుగురి పసి బిడ్డల హత్య.. ఆమెకు జీవిత ఖైదు!

ఇంగ్లండ్‌ లో ఏడుగురు పసిబిడ్డలను దారుణంగా చంపిన నర్సు ఉదంతం కొద్ది రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా కలకలం

By:  Tupaki Desk   |   21 Aug 2023 7:35 AM GMT
ఏడుగురి పసి బిడ్డల హత్య.. ఆమెకు జీవిత ఖైదు!
X

ఇంగ్లండ్‌ లో ఏడుగురు పసిబిడ్డలను దారుణంగా చంపిన నర్సు ఉదంతం కొద్ది రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల నర్సు లూసీకి జీవిత ఖైదు శిక్షగా పడే అవకాశముంది. ఈ మేరకు ప్రాసిక్యూషన్‌ కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పించింది. దీంతో ఆమెనున కోర్టు నేరస్తురాలిగా నిర్ధారించింది. దీంతో పాపం పండిందని బాధితుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాయవ్య ఇంగ్లాండ్లోని కౌంటెస్‌ ఆఫ్‌ చెస్టర్‌ హాస్పిటల్లో నియోనైటల్‌ విభాగంలో లూసీ లెట్బీ(35) పనిచేసేది. అందులో నియోనైటల్‌ విభాగంలో జూన్‌ 2015 నుండి జోన్‌ 2016 వ్యవధిలో ఏడుగురు పసిపిల్లలను ఆమె దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో ఆమెను బ్రిటీష్‌ పోలీసులు అరెస్టు చేశారు. పసి బిడ్డలను హత్య చేయడం ద్వారా ఈ నర్సు యూకే చరిత్రలోనే అతిపెద్ద సీరియల్‌ కిల్లర్‌ గా నిలిచింది.

జూన్‌ 2015 నుండి జూన్‌ 2016 మధ్య హాస్పిటల్‌ యూనిట్‌లో శిశువుల వరుస మరణాల నేపథ్యంలో ఆమెను అరెస్టు చేశారు. శిశువు చనిపోయిన ప్రతి సందర్భంలో లూసీ లెట్బీ షిప్ట్‌లో ఉన్నట్లు సహోద్యోగులు గమనించారు. ఆమెను రెండుసార్లు విడుదల చేసినప్పటికీ 2020 లో అరెస్టు తర్వాత నిర్బంధంలో ఉంచారు.

తాజాగా బ్రిటీష్‌ మాంచెస్టర్‌ క్రౌన్‌ కోర్టులో ఈ కేసుపై వాదనలు పూర్తయ్యాయి. లూసీ నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఏడుగురు పిల్లలను చంపడమే కాకుండా మరో ఆరుగురిపై హత్యాయత్నానికి పాల్పడింది. ఈ మేరకు ప్రాసిక్యూషన్‌ వాదించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించింది.

పసిపిల్లల శరీరంలోకి ఇంజక్షన్‌ ద్వారా గాలిని పంపించడం, ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ ఇవ్వడం, పాలు ఎక్కువగా పట్టించడం ద్వారా నిందితురాలు లూసీ ఈ హత్యలకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్‌ తెలిపింది.

ఈ కేసుపై మాంచెస్టర్‌ క్రౌన్‌ కోర్టులో మొత్తం సుమారు 110 గంటలు వాదనలు జరిగాయి. కాగా సోమవారం ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశముంది. ఈ కేసులో నేరం తీవ్రత పెద్దది కాబట్టి ఆమెకు జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే బాధిత కుటుంబాల్లో కొన్ని లూసీకి జీవితఖైదుపై హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఆమెకు ఈ శిక్ష సరిపోదని అంటున్నారు. ఆమెకు ఇంకా పెద్ద శిక్ష పడాలని కోరుకుంటున్నారు.