బెజవాడలో సైకో ప్రేమ.. ప్రేయసి ముందే ఆమె తండ్రిని చంపేశాడు
కులాలు వేర్వేరు కావటంతో ఇంట్లో ఆమె తల్లిదండ్రులు పెళ్లికి నో చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పది మందిని తీసుకొని శ్రీరామ్ ప్రసాద్ అబ్బాయి ఇంటికి వెళ్లి.. వాళ్ల అమ్మతో మాట్లాడారు.
By: Tupaki Desk | 28 Jun 2024 1:30 PM GMTనా కూతురితో ప్రేమ వ్యవహారం వద్దని చెప్పటమే ఆయన తప్పైంది. అంతే.. అతడి మీద కక్ష పెంచుకున్న సదరు సైకో లవ్వర్.. తన ప్రేయసి ఎదుటే ఆమె తండ్రిని హత్య చేసిన కిరాతకం విజయవాడలో చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. విజయవాడలోని క్రష్ణలంక పరిధిలో చోటు చేసుకున్న ఈ రాక్షస ప్రేమ ఉదంతంలోకి వెళితే..
విజయవాడ బృందావన్ కాలనీకి చెందిన కంకిపాటి శ్రీరామ్ ప్రసాద్ కు ఒక జనరల్ స్టోర్ ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె 22 ఏళ్ల దర్శిని విజయవాడలోని శ్రీపొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె స్నేహితురాలు హరిత ద్వారా గడ్డం శివమణికంఠతో నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఇద్దరు నిర్ణయానికి వచ్చారు.
కులాలు వేర్వేరు కావటంతో ఇంట్లో ఆమె తల్లిదండ్రులు పెళ్లికి నో చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పది మందిని తీసుకొని శ్రీరామ్ ప్రసాద్ అబ్బాయి ఇంటికి వెళ్లి.. వాళ్ల అమ్మతో మాట్లాడారు. తన కూతురితో ప్రేమ వ్యవహారం వద్దని చెప్పాడు. దీనికి మణికంఠ తల్లి సైతం కొడుకును వారించింది. దీంతో కోపానికి గురైన అతడు.. గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో షాపు మూసేసి ఇంటికి వెళుతున్న శ్రీరామ్ ప్రసాద్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కింద పడిపోయినప్పటికీ విడిచి పెట్టకుండా పలుమార్లు కత్తితో పొడిచాడు.
తన ఇంటికి వచ్చి.. తన తల్లితో ప్రేమ వద్దని మాట్లాడతాడా? అంటూ ఆగ్రహంతో అరుస్తూ.. అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన శ్రీరామ్ ప్రసాద్ ను ఒకప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను పరిశీలించిన వైద్యులు మరణించినట్లుగా పేర్కొన్నారు. ఈ ఘోర ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కొద్ది గంటల వ్యవధిలోనే నిందితుడు మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. ఎంత ప్రేమ అయితే మాత్రం.. తన ప్రేయసి ముందే.. ఆమె తండ్రిని చంపేసిన ఈ సైకో ప్రేమికుడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.