జల్సాలతో కొడుకు అప్పులు.. భరించలేని తండ్రి చంపేశాడు
హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నట్లుగా తండ్రికి అబద్ధం చెప్పి స్నేహితులతో కలిసి జల్సాలు చేస్తుండేవాడు చివరకు రూ.20 లక్షల అప్పులు చేశాడు.
By: Tupaki Desk | 27 April 2024 6:26 AM GMTబంధాలు.. అనుబంధాలు అంతకంతకూ దిగజారుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న హత్యలు కుటుంబ సభ్యుల మధ్య కొత్త సందేహాలకు తావిచ్చేలా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కరీంనగర్ లో చోటు చేసుకుంది. జల్సాలకు అలవాటు పడిన ఒక కొడుకు ఇష్టారాజ్యంగా అప్పులు చేసేయటమే కాదు.. ఆ అప్పుల్ని తీర్చటం కోసం ఉన్న భూమిని అమ్మేయాలని తండ్రి మీద ఒత్తిడికి తీసురావటం.. అమ్మనన్న తండ్రిని చంపేస్తానని బెదిరించటంతో దిక్కుతోచని స్థితిలో కొడుకును తండ్రి చంపేసిన వైనం సంచలనంగా మారింది.
కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన శ్రీనివాస్ దంపతులకు 21 ఏళ్ల కొడుకు శివసాయి.. కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నట్లుగా తండ్రికి అబద్ధం చెప్పి స్నేహితులతో కలిసి జల్సాలు చేస్తుండేవాడు చివరకు రూ.20 లక్షల అప్పులు చేశాడు.
వాటిని తీర్చటానికి భూముల్ని అమ్మాలని తండ్రి మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. తమకున్న భూమిని అమ్మేస్తే బతికేది ఎలా? అన్న దానికి సమాధానం చెప్పని శివసాయి.. భూమి అమ్మకపోతే తండ్రిని చంపేస్తానంటూ బెదిరించేవాడు.
దీంతో కొడుకు తనను ఎక్కడ చంపేస్తాడన్న భయంతో తండ్రి శ్రీనివాస్.. కొడుకు ఇంటికి వచ్చే వేళకు ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్లిపోయేవాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఇంట్లో ఎవరూ లేని వేళలో కొడుకు నిద్రపోతుంటే.. అతడి తల మీద రోకలి బండతో దాడి చేశాడు. శివసాయి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. అతడి కళ్లల్లో కారం కొట్టి రోకలిబండతో నాలుగుసార్లు తలమీద బలంగా కొట్టటంతో.. అక్కడికక్కడే మరణించాడు. అనంతరం తాను చేసిన హత్య గురించి పోలీసులకు ఫోన్ చేసి చెప్పి.. లొంగిపోయాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.