Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో: అమ్మాయికి వేధింపులు.. తండ్రి గొంతు కోసిన ఆరాచకం

ఈ సందర్భంగా ఆమెను వెంబడించిన సురేశ్.. 'హోలీ నుంచి దొరకటం లేదు. ఇప్పుడెక్కడికి వెళ్తావ్ అంటూ బకెట్ తో ఆమెపై నీళ్లు పోసి చేయి పట్టుకున్నాడు. అసభ్యకరంగా వ్యవహరించాడు.

By:  Tupaki Desk   |   2 April 2024 5:46 AM
హైదరాబాద్ లో: అమ్మాయికి వేధింపులు.. తండ్రి గొంతు కోసిన ఆరాచకం
X

అరాచకపు ఘటన ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఇలాంటి ఆరాచకవాదులకు జీవితాంతం గుర్తుండిపోయేలా శిక్షలు పడాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. సంచలనంగా మారిన ఈ ఉదంతం ఐటీ నగర ప్రాంతమైన నార్సింగ్ లో చోటు చేసుకుంది. స్కూల్ కు వెళ్లే బాలికపై కన్నేసిన ఒక యువకుడు ఆమెను వేధింపులకు గురి చేయటమే కాదు.. ప్రశ్నించిన తండ్రి గొంతు కోసిన వైనం పెను సంచలనంగా మారింది.

నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెమలీనగర్ లో ఈ అరాచక ఘటన చోటు చేసుకుంది. స్కూల్లో చదువుకునే బాలిక తన తల్లిదండ్రులతో ఉంటోంది. ఆమెపై స్థానికంగా ఉండే ఒక యువకుడు (సురేశ్) కన్నేశాడు. ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం సరకుల కోసం స్థానికంగా ఉండే షాపునకు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమెను వెంబడించిన సురేశ్.. ‘హోలీ నుంచి దొరకటం లేదు. ఇప్పుడెక్కడికి వెళ్తావ్ అంటూ బకెట్ తో ఆమెపై నీళ్లు పోసి చేయి పట్టుకున్నాడు. అసభ్యకరంగా వ్యవహరించాడు.

అతడి నుంచి తప్పించుకొని ఇంటికి పరిగెత్తిన ఆ బాలిక తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో.. ఆమె తండ్రి.. బంధువులు సురేశ్ ను నిలదీయటం కోసం అతడి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంలో బాలిక జడ పట్టుకున్న సురేశ్.. అతని స్నేహితులు బాలిక తల్లిదండ్రులు.. బంధువులపై దాడికి పాల్పడ్డారు. కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలో బాలిక తండ్రికి.. తల్లికి గొంతుకు గాయమైంది.

తమను కత్తులతో గాయాలపాలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని సురేశ్ తో పాటు ప్రవీణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అరాచక ఉదంతంతో లింకులు ఉన్న ఎవరిని విడిచిపెట్టేది లేదని పోలీసులు చెబుతున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంపై సీరియస్ యాక్షన్ ఉండాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.