ప్రేమించినోడ్ని పెళ్లి చేసుకోమంటే.. వాటర్ ట్యాంక్ కిందకు తోసేశాడు
కామారెడ్డి జిల్లాలోని నెమలిగుట్ట తండాకు చెందిన 23 ఏళ్ల ప్రమీల ఇంటర్ పూర్తి చేసి.. సిటీకి వలస వచ్చింది.
By: Tupaki Desk | 7 Aug 2023 4:33 AM GMTమరో అమానుష ఉదంతం వెలుగు చూసింది. ప్రేమించిన పాపానికి.. పెళ్లి చేసుకోవాలని కోరిన దానికి నిండు ప్రాణాల్ని తీసేసిన ఒక కసాయి ప్రేమికుడి ఉదంతమిది. హైదరాబాద్ మహానగర శివారులోని బాచుపల్లిలో చోటు చేసుకున్న ఈ ఆరాచక ఉదంతం షాకింగ్ గా మారింది.
కామారెడ్డి జిల్లాలోని నెమలిగుట్ట తండాకు చెందిన 23 ఏళ్ల ప్రమీల ఇంటర్ పూర్తి చేసి.. సిటీకి వలస వచ్చింది. 2022 జనవరిలో ఆమెకు పెళ్లి జరగ్గా.. ఏప్రిల్ లో భర్త చనిపోయాడు. బాచుపల్లికి సమీపంలోని బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీలో ముగ్గురు యువతులతో కలిసి ఉంటోంది. బాచుపల్లిలోని ఒక స్టీల్ షాపులో పని చేస్తోంది.
ఆమె సొంతూరుకు దగ్గర్లోని రోడ్ బండ్ తండాకు చెందిన పాతికేళ్ల భూక్యా తిరుపతి నాయక్ తో పరిచయం ఉంది. ఇతగాడు కొండాపూర్ లో ఉంటూ కారు డ్రైవర్ గా పని చేస్తుంటాడు. ఊరికి దగ్గర వాడే కావటం.. చిన్నతనంలో పరియం ఉండటంతో అతనితో మాట్లాడేది. అది కాస్తా ప్రేమగా మారింది.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యన తిరుపతికి మరో యువతితో ఎంగేజ్ మెంట్ జరిగింది. దీంతో.. ప్రమీల అతడికి ఫోన్ చేస్తూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయసాగింది. లేని పక్షంలో తమ ప్రేమ సంగతి తన తల్లిదండ్రులకు చెబుతానని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం తనను కలవాలని ప్రమీల చెప్పటంతో తిరుపతి టూ వీలర్ మీద మరో ఫ్రెండ్ తో కలిసి బాచుపల్లి మొయిన్ రోడ్డు వద్దకు వచ్చి కలిశాడు. పెళ్లి విషయం మీద ఆమె నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం.. పెనుగులాట చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన తిరుపతి.. అప్పుడే అటుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ కిందకు తోసేశాడు.
దీంతో.. ఆమె అక్కడికక్కడే మరణించింది. ప్రమాదవశాత్తు ఆమె ట్యాంకర్ కిందకు పడిందని అక్కడున్న వారిని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే.. అక్కడే ఉన్న స్థానికులు గట్టిగా ప్రశ్నించటంతో తానే ట్యాంకర్ కిందకు తోసేసినట్లుగా ఒప్పుకున్నాడు. నిందితుడ్ని అరెస్టు చేసిన కేసు నమోదు చేశారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అడగటమే తప్పు అన్నట్లుగా ప్రాణాలు తీసిన ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.