సైబర్ నేరగాళ్ల కొత్త మోసం.. వాట్సాప్ అకౌంట్లూ హ్యాక్!
వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ముందుగా ఫేస్ బుక్ ను వాడుకుంటున్నారు.
By: Tupaki Desk | 26 July 2023 1:30 AM GMTనేరగాళ్లందు సైబర్ నేరగాళ్లు వేరయా అని చెప్పుకోవాల్సిన రోజులు ఇవి. ఆన్ లైన్ లో అప్రమత్తంగా లేకపోతే ఏక్షణమైనా హ్యాకింగ్ బారిన పడాల్సి రావొచ్చు. ఫేస్ బుక్ నుంచి బ్యాంక్ అకౌంట్ వరకూ... ఆన్ లైన్ లో ఉద్యోగం నుంచి షాపింగ్ లో ఆఫర్ల వరకూ కాదేదీ హ్యాకింగ్ కి అనర్హం అంటూ చెలరేగిపోతుంటారు సైబర్ నేరగాళ్లు.
ఈ సమయం లో వారి దృష్టి వాట్సప్ అకౌంట్ల పై పడిందని తెలుస్తుంది. అవును... తాజాగా హ్యాకర్లు వాట్సప్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారంట. దీనికోసం ఫేస్ బుక్ నే మార్గంగా ఎంచుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా వాట్సప్ కి వచ్చే లింకులు, ఫేస్ బుక్ లో నకిలీ స్నేహితుల విషయం లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
ఈ మొత్తం దందా ఎలా జరుగుతుంది.. హ్యాకర్లను వాట్సప్ ను మనకు తెలిసే ఎలా హ్యాక్ చేస్తున్నారు.. ఎలాంటి సందర్భాల్లో హ్యాక్ చేసే అవకాశం ఉంది మొదలైన విషయాల ను పోలీసులు చెబుతున్నారు. అవేమిటనేది ఇప్పుడు చూద్దాం! దీనికి ఫేస్ బుక్ ని ఎలా వాడుతున్నారో చూద్దం.
వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ముందుగా ఫేస్ బుక్ ను వాడుకుంటున్నారు. ఇందులో భాగంగా.. ఓ వ్యక్తి పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ తెరిచి.. తద్వారా ఆ వ్యక్తికి చెందిన ఫ్రెండ్స్ లిస్ట్ లో వ్యక్తిగతంగా మెసెంజర్ లింక్ పంపిస్తున్నారు. దానికి యోగా క్లాసులనో, ఆన్ లైన్ క్లాసులనో, కోచింగ్ క్లాస్ లనో పేరు పెడుతున్నారు.
తర్వాత ఓ లింక్ పంపించి ఆ లింక్ పై క్లిక్ చేయాలని సూచిస్తారు. తర్వాత వచ్చే ఆరంకెల ఓటీపీ ని తమకు తెలియజేయాలని అడుగుతారు. అప్పుడే మీరు ఉచితంగా ఆ వీడియోలు చూడగలరని చెబుతారు. వాస్తవానికి అది క్లాసుల యాక్సెస్ కి ఉపయోగపడే కీ కాదు... అది వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్!
అలా వచ్చిన ఓటీపీ ని ఒకసారి ఆ వ్యక్తికి పంపించాక మీ వాట్సాప్ అకౌంట్ సైబర్ నేరగాళ్ల చేతికి వెళుతుందని పోలీసులు చెబుతున్నారు. గత నెల యోగా దినోత్సవం సందర్భంగా ఈ తరహా కేసులు ఎక్కువగా వచ్చాయని, ఈసారి మరో ఎత్తుగడతో రావొచ్చని... అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఆ విధంగా అకౌంట్ ని హ్యాక్ చేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు బాధితుడి కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి టచ్ లోకి వెళ్తారు. ఎమర్జెన్సీ అని డబ్బులు అడగడం మొదలుపెడతారు. ఇదే సమయంలో క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాలంటూ మోసగిస్తుంటారని పేర్కొన్నారు పోలీసులు. ఈ విషయాల ను పరిగణ లోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు!