Begin typing your search above and press return to search.

చలాన్‌ పేరిట ఎస్సెమ్మెస్... క్లిక్ చేస్తే హాంఫట్!

కాదేదీ సైబర్ నేరానికి అనర్హం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఒక్క ఎస్సెమ్మెస్, ఒక్క లింక్ తో మొత్తం ఒకేసారి క్షవరం అయిపోయే పరిస్థితి వచ్చింది!

By:  Tupaki Desk   |   31 Aug 2023 5:38 AM GMT
చలాన్‌ పేరిట ఎస్సెమ్మెస్... క్లిక్ చేస్తే హాంఫట్!
X

కాదేదీ సైబర్ నేరానికి అనర్హం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఒక్క ఎస్సెమ్మెస్, ఒక్క లింక్ తో మొత్తం ఒకేసారి క్షవరం అయిపోయే పరిస్థితి వచ్చింది! ఈ క్రమంలో ప్రైవేటు ఎస్సెమ్మెస్ లైతే జనం సరిగా రియాక్ట్ అవ్వడంలేదనుకున్నారో ఏమో కానీ.. ఈసారి ప్రభుత్వం పెట్టినట్లు ఎస్సెమ్మెస్ లు పెడుతున్నారు సైబర్ నేరగాళ్లు.

అవును... ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం పంపినట్లు మెసేజ్ లు పంపిస్తున్నారు. ప్రభుత్వ ఎస్సెమ్మెస్ లు కదా ఓపెన్ చేసి ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే ఖాతా వివరాలను హ్యాక్ చేసి అందులోని డబ్బులు కొట్టేస్తున్నారు. తర్వాత విషయం తెలుసుకుని లబో దిబో మంటున్నారు బాధితులు!

వివరాళ్లోకి వెళ్తే... ఈ మధ్యకాలంలో సైబర్‌ నేరగాళ్లు ఇ-చలాన్‌ ల పేరిట ఎస్సెమ్మెస్ లు పంపుతున్నారు. అందులోనే ఓ పేమెంట్‌ లింక్‌ ను కూడా అటాచ్ చేస్తున్నారు. దీంతో ఇది నిజమేనని, ప్రభుత్వం పంపించిన సందేశమే అని నమ్మి ఆ లింక్‌ ను క్లిక్‌ చేస్తే.. బ్యాంకు ఖాతా వివరాలను హ్యాక్‌ చేసి, అందులోని డబ్బులును కొట్టేస్తున్నారు. పోలీసులు చెప్తున్నారు.

సాధారణంగా చలాన్‌ ల పేరిట వచ్చే ఎస్సెమ్మెస్స్ లలో వాహనం నెంబరు, ఇంజిన్‌ నెంబర్, ఛాసిస్‌ నెంబర్‌ వంటి వివరాలు ఉంటాయి. కానీ... సైబర్‌ నేరగాళ్లు పంపించే వాటిలో ఆ వివరాలు ఏవీ ఉండవు. కాకపోతే అమౌంట్ ఎంత అనేది మాత్రం ఉంటుంది.. దానికిందే పేమెంట్ లింక్ ఉంటుంది. పొరపాటున ఆ లింక్ పై క్లిక్ చేస్తే... అకౌంట్ లో ఉన్న మొత్తం సొమ్ము హాంఫట్ అయిపోద్ది!

కాబట్టి... ఇలాంటి ఎస్సెమ్మెస్లు సెల్‌ ఫోన్‌ నెంబర్ల నుంచి రావనే విషయం గుర్తుంచుకోవాలని పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి మెసేజ్ లు ఏమైనా వస్తే... ముందుగా అధికారిక వెబ్‌ సైట్‌ కు వెళ్లి చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చలాన్‌ లకు సంబంధించిన అధికారిక వెబ్‌ సైట్‌ ను పోలిన వెబ్‌ సైట్లతో ఈ మోసాలకు పాల్పడుతుంటారని, ఇలాంటి మెసేజ్ వచ్చేటప్పుడు ఆ లింకులను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో చలాన్ లకు సంబంధించిన ఎస్సెమ్మెస్స్ లే కాకుండా... ఫోన్ లు కూడా చేసి మరీ మెసేజ్ లు పంపుతున్నారని తెలుస్తోంది. దీంతో... అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పోలీసులు... ఒకవేళ సైబర్‌ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్‌ కు కాల్‌ చేయాలని సూచిస్తున్నారు.