Begin typing your search above and press return to search.

జర్మనీలో కల్యాణ్ రాం సినిమా సీన్... రియల్ మర్డర్!

వివరాళ్లోకి వెళ్తే... 23 ఏళ్ల జర్మన్-ఇరాకీ మహిళ షరాబన్ కె తనలాంటి మరో రూపాన్ని డొపెల్ గ్యాంగర్ ద్వారా కనుగొనాలని..

By:  Tupaki Desk   |   27 July 2023 3:57 AM GMT
జర్మనీలో కల్యాణ్  రాం సినిమా సీన్... రియల్  మర్డర్!
X

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. అలా ఎందుకు అన్నారనేది తెలియక పోయినా... సరిగ్గా ఏడుగురే ఉంటారని చెప్పలేకపోయినా.. ఈ భూ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు మాత్రం ఉంటారనేది తెలిసిన విషయమే. వారిని గుర్తించేదే డోపెల్ గ్యాంగర్!

ఈ విశాల ప్రపంచంలో తనలాంటి రూపం కలిగిన మరో మనిషిని కనుగొనాలని, వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలనే ఆతృత ఉండటం సహజం. ఈ సమయంలో అలాంటి వారికోసం డోపెల్ గ్యాంగర్ అనే వెబ్ సైట్ ని రూపొందించారు. ఆ బేస్ పైనే కల్యాణ్ రాం నటించిన "అమిగోస్" సినిమా కూడా ఈ మధ్యకాలంలో విడుదలైంది.

సరిగ్గా ఆ సినిమా తరహాలోనే ఒక భయంకరమైన హత్య జర్మనీలో జరిగింది. తనను పోలి ఉన్న మరో మనిషిని కనుగొని వారిని హత్య చేసి.. తన మరణాన్ని నకిలీ చేయాలని ప్రయత్నించింది ఒక యువతి. ఆలస్యంగా కనుగొనబడిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చి హాట్ టాపిక్ గా మారింది.

అవును... 23 ఏళ్ల జర్మన్-ఇరాకీ మహిళ షరాబన్ కె ఇన్‌ స్టాగ్రామ్‌ లో తనలాంటి ఒక రూపాన్ని కనుగొని, తన సొంత మరణాన్ని నకిలీ చేసే ప్రయత్నంలో తన డోపెల్‌ గాంజర్‌ ను కనికరం లేకుండా చంపిందని తెలుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే... 23 ఏళ్ల జర్మన్-ఇరాకీ మహిళ షరాబన్ కె తనలాంటి మరో రూపాన్ని డొపెల్ గ్యాంగర్ ద్వారా కనుగొనాలని.. అనంతరం ఆమెను చంపాలని.. ఫలితంగా ప్రపంచాన్ని తానే మరణించినట్లు నమ్మించాలని పెద్ద ప్లానే వేసింది. దీనికోసం ఒక నకిలీ ఇన్ స్టా గ్రాం అకౌంట్ ఓపెన్ చేసింది.

ఈ సమయంలో ఆమెకు 23 ఏళ్ల ఖాదిద్జా ఓ అనే అల్జీరియన్ బ్యూటీ బ్లాగర్ కనిపించింది. ఆమె అచ్చుగుద్దినట్లు ఈమెలానే ఉంది. దీంతో తన ఫేక్ ప్రొఫైల్‌ ని ఉపయోగించి ఇన్‌ స్టాగ్రామ్ ద్వారా ఖదీద్జా ను షరబాన్ సంప్రదించింది. అనంతరం పరస్పరం కలుసుకునేందుకు ఒప్పించింది. ఈ విషయంలో ఖదీద్జా మొదట సంశయించినా చివరికి కలవడానికి అంగీకరించింది.

దీంతో ఖాదిద్జా ను ఖతం చేయాలని, ఫలితంగా తానే మరణించినట్లు చూపించుకోవాలని ఫిక్సయిన షరబాన్.. దానికోసం తన బాయ్ ఫ్రెండ్ సహాయం తీసుకొంది.

ఖదీద్జాను షరాబాన్ కె, ఆమె ప్రియుడు షెకిర్ కె సంప్రదించారు.. అనంతరం బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం అని సిటీ అవుట్ కట్స్ కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నిర్మానుష్య ప్రదేశంలో ఆగి.. ఖదీద్జాను అతికిరాతకంగా కత్తితో పొడిచి చంపేశారు.

అప్పటికే ఆమె తన మాజీ భర్తను కలవడానికి వెళ్తున్నట్లు ఇంట్లోవాళ్లకి చెప్పిన షరాబాన్... తిరిగి రాకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం వెతికారు. ఈ ప్రయత్నంలో డానుబే నదికి సమీపంలో ఉన్న మెర్సిడెస్‌ లో ఆమెను శరీరాన్ని కనుగొన్నారు!

గతేడాది ఆగస్టు 16న జర్మనీ పోలీసులు షరబాన్ మెర్సిడేస్ లో ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళ శరీరంపై 50 కంటే ఎక్కువ కత్తిపోట్లు ఉండటంతోపాటు ఆమె ముఖం మొత్తం ఛిద్రమైపోయి ఉంది. దీంతో షరబాన్ మృతి చెందిందని భావించారు ఆమె కుటుంబ సభ్యులు.

అయితే శవపరీక్షలో మాత్రం ట్విస్ట్ జరిగింది. ఆ మృతదేహం షరబాన్ ది కాదని తేలింది. ఇదే సమయంలో ఆ బాడీ ఖదీద్జాది అని గుర్తించబడింది. అయితే గోధుమ రంగు కళ్ళు, పొడవాటి ఉంగరాల జుట్టు, ఆలివ్ స్కిన్ తో సహా సారూప్యత అలాగే ఉన్నందున బాడీ తమ కుమార్తెదేనని కుటుంబం మొదట్లో నమ్మింది.

అయితే విషయం గ్రహించిన పోలీసులు షరబాన్ ను గుర్తించి, ఆరాతీయగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో షరబాన్ పై హత్యానేరం మోపబడింది. అయితే గతేడాది జరిగిన ఈ డొపెల్ గ్యాంగర్ హత్య ఇప్పటికీ వెన్నులో వణుకుపుట్టిస్తుందని అంటున్నారు. ఆ స్థాయిలో ఆ హత్య జరిగింది.

అయితే ఈ హత్యకు ఉపయోగించిన ఆయుధం మాత్రం దొరకలేదు. ఈ విచారణలో మరిన్ని సాక్షులను విచారించవలసి ఉంది. దోషులుగా తేలితే షరబాన్, అతని బాయ్ ఫ్రెండ్ కి జీవిత ఖైదు పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.