Begin typing your search above and press return to search.

ఫెయిల్ అవుతున్నావ్.. చదవొద్దంటే తల్లిదండ్రుల్ని చంపేశాడు

డిసెంబరు 26న ఈ దారుణ ఘటన జరగ్గా.. కొత్త ఏడాది మొదటి రోజున ఈ హత్యల వ్యవహారం వెలుగు చూసింది.

By:  Tupaki Desk   |   2 Jan 2025 4:31 AM GMT
ఫెయిల్ అవుతున్నావ్.. చదవొద్దంటే తల్లిదండ్రుల్ని చంపేశాడు
X

రోజులు గడుస్తున్న కొద్దీ తెర మీదకు వస్తున్న కొన్ని నేరాలు.. ఘోరాల గురించి విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. మనసంతా చేదుగా మారిపోతున్న దుస్థితి. ఇటీవల కాలంలో ఈ తరహా దారుణాల సంఖ్య పెరుగుతోంది. గతంలో చాలా అరుదుగా వెలుగు చూసే ఈ షాకింగ్ విషాదాలు.. ఇప్పుడు పెరుగుతున్న వైనం చూస్తే.. మనసు బరువెక్కటం ఖాయం. ఇంజినీరింగ్ చదువుతూ.. తరచూ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతున్న కొడుకును చదవొద్దన్న తల్లిదండ్రుల్ని చంపేసిన దారుణం మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

డిసెంబరు 26న ఈ దారుణ ఘటన జరగ్గా.. కొత్త ఏడాది మొదటి రోజున ఈ హత్యల వ్యవహారం వెలుగు చూసింది. మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలోకి వెళితే.. నగరానికి చెందిన ఉత్కర్ష్ డాఖోలే ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతడి తండ్రి లీలాధర్ డాఖోలే (55).. అరుణ డాఖోలే (50). తమ కుమారుడు తరచూ పరీక్షల్లో ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో.. ఇంజనీరింగ్ కోర్సు ఆపేయాలంటూ ఒత్తిడి తెచ్చారు.ఈ క్రమంలో కోపానికి గురైన అతను.. డిసెంబరు 26న తొలుత తన తల్లిని. తర్వాత తన తండ్రిని దారుణంగా హతమార్చాడు.

తల్లిదండ్రుల్నిచంపిన విషయాన్ని దాచి పెట్టి.. చెల్లెల్నిబంధువుల ఇంటికి పంపాడు. తన తల్లిదండ్రులు మెడిటేషన్ కార్యక్రమానికి వెళ్లారని.. అక్కడి వారి ఫోన్లు తీసుకెళ్లటానికి అనుమతి లేదని అందరికి చెప్పటం ప్రారంభించాడు.

అయితే.. మూడు రోజుల తర్వాత నుంచి నిందితుడి ఇంటి నుంచి దుర్వాసన రావటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారాన్ని ఇచచారు. దీంతో.. వారు తలుపులు తెరిచి చూడగా.. వారి డెడ్ బాడీలు కనిపించాయి. దీంతో ఉత్కర్ష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. తానే తన తల్లిదండ్రుల్ని చంపేశానని.. తాను చదువుతున్న ఇంజనీరింగ్ కోర్సును చదవొద్దని ఒత్తిడి చేయటంతో తాను ఆ పని చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచనలంగా మారింది.