కుమారుడి హత్యకు సుపారీ ఇచ్చిన తండ్రి!
ఎంతో ప్రేమతో పెంచిన కుమారుడిని అంతం చేయమని ఓ తండ్రి సుపారీ ఇచ్చాడు.
By: Tupaki Desk | 22 Dec 2024 12:30 PM GMTఎంతో ప్రేమతో పెంచిన కుమారుడిని అంతం చేయమని ఓ తండ్రి సుపారీ ఇచ్చాడు. వ్యసనాలకు బానిసైన కుమారుడి నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోడానికి పేగు బంధాన్ని తెంచుకోవడం ఒక్కటే మార్గమని భావించాడు. ఆలోచన వచ్చిందే తడువుగా ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి కుమారుడిని కాటికి పంపాడు. సంఘటన జరిగిన 20 రోజులుకు పశువుల కాపరుల ద్వారా శవం వెలుగుచూడటంతో అసలు విషయం బయటపడింది.
కసాయిగా మారిన కుమారుడిని చంపేయాలని నిర్ణయించుకున్న తండ్రి స్టోరి ఇది. చిత్తూరు జిల్లా పుంగునూరులో బయటపడిన గుర్తు తెలియని శవం కేసులో సంచలన విషయం వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ దిగువ మామిడి గుంపలపల్లెకు చెందిన గంగులరెడ్డి, నారాయణమ్మలకు ఇద్దరు కుమారులు. ఇందులో చిన్న కుమారుడు పేరు సోమశేఖర్ రెడ్డి. వ్యసనాలకు బానిసైన సోమశేఖర్ రెడ్డి వేధింపులు భరించలేక పదేళ్ల క్రితమే భార్య, ఐదేళ్ల కుమారుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో సోమశేఖర్ రెడ్డితోపాటు అతడి తండ్రి జైలుకు వెళ్లివచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సోమశేఖర్ రెడ్డిలో సైకోయిజం మరింత పెరిగిపోయింది. గ్రామంలో కనిపించిన ప్రతి ఒక్కరితో గొడవలకు దిగడం, మద్యం తాగేందుకు డబ్బులిమ్మంటూ తల్లిదండ్రులను కొట్టడం పరిపాటిగా మారింది. అతడి ప్రవర్తనను భరించలేక సోదరుడు తన భార్య, పిల్లలతో వేరే ఊరు వెళ్లిపోయాడు. చిన్న కొడుకు ఎంత సతాయిస్తున్న కన్న పేగు బంధంతో ఆ తల్లిదండ్రులు ఇన్నాళ్లు ఓర్చారు. ఐతే నానాటికి సోమశేఖర్ రెడ్డి టార్చర్ పెరిగిపోవడంతో అతడిని చంపేయాలని తండ్రి గంగుల్ రెడ్డి నిర్ణయించుకున్నాడు.
కుమారుడి వేధింపుల నుంచి బయటపడేందుకు హత్య చేయించాలని భావించిన గంగుల్ రెడ్డి పుంగనూరు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులను మాట్లాడుకున్నాడు. సుపారీగా 40 వేల రూపాయలకు మాట్లాడుకున్నాడు. ఇందులో 30 వేలు అడ్వాన్స్గా ఇచ్చాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం 20 రోజుల క్రితం సోమశేఖర్ రెడ్డిని క్రిష్ణాపురం సమీపంలోని బోయకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మందు తాగించి హత్య చేశారు. అనంతరం శవాన్ని అక్కడే వదిలేసి వచ్చేశారు. అడవిలో దుర్వాసన వస్తుండటంతో అటుగా వచ్చిన పశువుల కాపరులు శవాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది.