కన్నింగ్ లేడీ.. మాజీ ప్రియుడి మీద పగతో ఇలాంటి ప్లానింగా?
రహ్మత్ నగర్ నివాసి. 23 ఏళ్ల ఆమె కూకట్ పల్లిలోని ఒక లా కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది
By: Tupaki Desk | 27 Dec 2023 6:36 AM GMTకొన్ని సినిమాల్లోనూ.. టీవీ సీరియల్స్ లోనూ అమ్మాయిల్ని అత్యంత దుర్మార్గంగా చూపించే పాత్రల్ని చూసినప్పుడు నిజ జీవితంలో అసలు ఉంటారా? అన్న భావన కలుగుతుంది. కానీ.. ఈ కిలేడీ గురించి తెలిస్తే మాత్రం ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? అన్న షాక్ తగలకమానదు.
ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్ గా ఉన్న ఒక అమ్మాయి.. తన ప్రియుడి మీద పగతో రగిలిపోతూ అతన్ని అడ్డంగా బుక్ చేయటానికి వేసిన దుర్మార్గమైన ప్లానింగ్ గురించి తెలిస్తే నోట వెంట మాట రాదంతే. ఇంతకూ ఆమె చేసిన దారుణమైన ప్లానింగ్ చివరకు ఆమెకే రివర్సు అయ్యింది. ఇప్పుడు ఆమె.. ఆమెకు సహకరించిన ఆరుగురు సైతం జైల్లో లెక్కిస్తున్నారు. సినిమాటిక్ క్రైం స్టోరీలోకి వెళితే..
రహ్మత్ నగర్ నివాసి. 23 ఏళ్ల ఆమె కూకట్ పల్లిలోని ఒక లా కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమెకు రెండేళ్లుగా సరూర్ నగర్ కు చెందిన 30ఏళ్ల వ్యక్తి తో ప్రేమలో ఉంది. ఇరువురి మధ్య వచ్చిన అభిప్రాయబేధాలతో నాలుగు నెలల క్రితం విడిపోయారు. తమ రిలేషన్ బ్రేకప్ అయ్యాక తన గురించి మాజీ బాయ్ ఫ్రెండ్ బాడ్ గా చెబుతున్నాడని అనుమానించింది. తాను పబ్ లకు వెళ్లి డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా మాజీ బాయ్ ఫ్రెండ్ ప్రచారం చేస్తున్నట్లుగా తెలిసింది. దీంతో అతడికి బుద్ధి చెప్పాలని భావించింది. తనకు డ్రగ్స్ అలవాటు ఉందన్న రీతిలో ప్రచారం చేసే మాజీ బాయ్ ఫ్రెండ్ ను గంజాయి కేసులో బుక్ చేస్తే దెబ్బకు దెబ్బ అన్నట్లు ఉంటుందని భావించింది.
మాజీ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తర్వాత గడ్డి అన్నారానికి చెందిన ఐటీ ఉద్యోగి 30 ఏళ్ల వ్యక్తి తో పరిచయం ఏర్పడటం అది కాస్తా ప్రేమగా మారింది. ఆమె తన ప్లాన్ ను అతనకి చెప్పగా.. అతను ఓకే చెప్పాడు. ప్లాన్ లో భాగంగా రూ.14వేలను అతను ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేసి.. ఆ డబ్బుతో గంజాయి పాకెట్లను కొనాలని చెప్పింది. అనంతరం అతను తన స్నేహితుడైన ఇంకో వ్యక్తి కి రూ.3500 ఇచ్చి ధూల్ పేటకు వెళ్లి గంజాయి పాకెట్లు కొనుగోలు చేయాలని చెప్పాడు. దీంతో.. 8 పాకెట్లను కొనుక్కొచ్చాడు.
దీంతో తమ ప్లాన్ ను అమలు చేయటానికి మాజీ బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేయించింది. క్రిష్ణ కాంత్ పార్కు వద్దకు రావాలని కోరగా.. అందుకే సరేనని చెప్పిన అతను కలిశాడు. ఆ కన్నింగ్ లేడీ తన ఆరుగురు స్నేహితులతో అక్కడకు చేరుకుంది. పబ్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 38లోని అమ్నేషియా పబ్ కు వచ్చారు. పబ్ కు వచ్చేందుకు తన మాజీ బాయ్ ఫ్రెండ్ కారులో కొందరిని ఎక్కించింది. అతనికి తెలీకుండా కారు సీటు కింద గంజాయి పాకెట్లు పెట్టేశారు. పబ్ కు వెళ్లిన కాసేపటి వరకు సరదాగా గడిపిన వారు.. ఒక్కొక్కరుగాలేడీ వెళ్లిపోసాగారు. ఇదే సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి.. ఫలానా పబ్ వద్ద.. ఫలానా కారులో గంజాయి పాకెట్లు ఉన్నాయన్న సమాచారాన్ని అందించింది.
దీంతో.. అలెర్టు అయిన పోలీసులు పబ్ వద్దకు వచ్చి కారును తనిఖీ చేయగా.. అందులో గంజాయి పాకెట్లు లభించాయి. అయితే.. తనకు.. గంజాయి పాకెట్లకు సంబంధం లేదని వాపోయాడు. దీంతో.. పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన పోలీసులు తన మాజీ గర్ల్ ఫ్రెండ్.. ఆమె స్నేహితులపై అనుమానం వచ్చి వారిని స్టేషన్ కు పిలిపించారు. విచారణలో భాగంగా పొంతన లేని సమాధానాలు రావటంతో మరింత గట్టిగా ప్రశ్నించటంతో అసలు విషయం బయటపెట్టారు.
దీంతో వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తో పాటు ఆమెకు సహకరించిన ఆరుగురు స్నేహితుల్ని రిమాండ్ కు తరలించారు. తాను ఇరికించే క్రమంలో తాను అడ్డంగా బుక్ అవుతానన్న లాజిక్ ను లా విద్యార్థిగా ఉన్న ఆమె ఎందుకు మిస్ అయినట్లు? అన్నది అసలు ప్రశ్న. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్న విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆధారాల్ని సమర్పిస్తే సరిపోయే దానికి పగ అంటూ తప్పడు మార్గాన్ని ఎంచుకోవటం.. గుడ్డిగా ఆమెకు సహకరించిన వారంతా జైలుకు వెళ్లే పరిస్థితి.