Begin typing your search above and press return to search.

రెండో భార్య ఒత్తిడితోనేనా హెడ్‌ కానిస్టేబుల్‌ దారుణం!

ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబ సమస్యలతో పిస్టల్‌ తో భార్యను, ఇద్దరు టీనేజ్‌ కుమార్తెలను దారుణంగా కాల్చిచంపాడు. అంతేకాకుండా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By:  Tupaki Desk   |   6 Oct 2023 8:49 AM GMT
రెండో భార్య ఒత్తిడితోనేనా హెడ్‌ కానిస్టేబుల్‌ దారుణం!
X

కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు హత్యలు చేయడం, ఆత్మహత్యలకు పాల్పడటం వంటివి ఇటీవల కాలంలో ఎక్కువ అయిపోతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వస్తున్న గొడవలకు కనిపించిన పిల్లలను బలి తీసుకుంటున్నారు. హత్యకు ఒడిగట్టే సమయంలో తాము వారిని కనిపెంచామని కానీ.. అల్లారుముద్దుగా... అత్తారుబత్తెంగా సాకామని కానీ వారికి గుర్తు ఉండటం లేదు.

ఇప్పుడు ఇదే కోవలో కడప జిల్లా పులివెందులలో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబ సమస్యలతో పిస్టల్‌ తో భార్యను, ఇద్దరు టీనేజ్‌ కుమార్తెలను దారుణంగా కాల్చిచంపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విదితమే. ఈ ఘటనలో భార్య, ఇద్దరు టీనేజ్‌ కుమార్తెలను కాల్చి చంపిన కానిస్టేబుల్‌ ఆ తర్వాత అంతేకాకుండా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం పోలీసు వర్గాలను సైతం నివ్వెర పరిచింది.

ఈ దారుణ ఘటన జరిగాక పోలీసుల విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయని చెబుతున్నారు. పులివెందులకు చెందిన టి.వెంకటేశ్వర్‌ (51) కడపలోని కో–ఆపరేటివ్‌ కాలనీలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. కడప రెండో పట్టణ పోలీసు ఠాణాలో గత రెండేళ్లుగా హెడ్‌ కానిస్టేబుల్‌ (రైటర్‌)గా ఆయన పనిచేస్తున్నారు.

కాగా హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్‌ కు భార్య మాధవి (47), డిగ్రీ చదువుతున్న లాస్య (19), పదో తరగతి చదువుతున్న అభిజ్ఞ (16) అనే ఇద్దరు కుమార్తెలున్నారు.

మరోవైపు ఆయనకు రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఆమెకు తొలుత నాగేశ్వరరెడ్డి అనే వ్యక్తితో వివాహం కాగా, ఆయన మరణించారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్‌.. రమాదేవికి దగ్గరయ్యాడని చెబుతున్నారు. అయితే రమాదేవి.. వెంకటేశ్వర్‌ కు ఉన్న ఆస్తిని తన పేరు మీద, తన కుమారుడి మీద రాయాలని ఆమె ఎప్పటి నుంచో ఆయనను ఒత్తిడి చేయడంతోపాటు బెదిరింపులకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్‌... హత్యకు నాలుగు నెలల ముందు నుంచే పథకం వేసినట్లు చెబుతున్నారు. ఆయన రూ.10 విలువ చేసే రెండు బాండు పత్రాలను ముందుగానే కొనుగోలు చేసి తన దగ్గర పెట్టుకున్నారని అంటున్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే ఘటన జరగడానికి ముందు ఆయా బాండ్లపై ఎస్పీకి రాసిన లేఖలో తన మరణాంతరం వర్తించే ఆర్థిక సాయం, కుటుంబ పింఛను తదితరాలను తన రెండో భార్య రమాదేవికి చెందేలా చూడాలని రాశారని చెబుతున్నారు. అలాగే ఆమె ఇష్టపడితే తన ఉద్యోగం కూడా ఇవ్వాలని, లేకపోతే ఆమె కుమారుడు నాగ లోకేశ్వర్‌ రెడ్డికి ఇవ్వాలని బాండ్‌ పేపర్ల మీద రాసి సంతకాలు చేసినట్టు పేర్కొంటున్నారు.

అదేవిధంగా తన భార్య మాధవి కూడా మరణిస్తుంది కాబట్టి ఆమె బీమా పాలసీలతో వచ్చే డబ్బును కూడా రమాదేవికి వర్తించేలా చూడాలని బాండు పత్రాలపై రాశారని తెలుస్తోంది. ఇవన్నీ పరిశీలిస్తే వెంకటేశ్వర్‌ పథకం ముందస్తు ప్రకారమే ఇదంతా చేసినట్లు భావిస్తున్నారు.

కాగా ఈ ఏడాది జూన్‌ 26న రూ.20 లక్షల విలువ చేసే భూమిని రమాదేవికి విక్రయించినట్లు మరో అగ్రిమెంటు లేఖ వీరి మృతదేహాల పక్కనే ఉంది. అందులో మాత్రం ఆమెను నాగేశ్వరరెడ్డి భార్యగానే పేర్కొన్నారు. మరోవైపు హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్‌ కు రమాదేవి రెండో భార్య అనే విషయం తమకు తెలియదని ఆయన బంధువులు చెబుతున్నారు.

కాగా మృతుడు వెంకటేశ్వర్‌ గతంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా గన్‌ మెన్‌ గా కూడా పనిచేశాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబం మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ వెల్లడించారు. రమాదేవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. శవపరీక్షల అనంతరం లభించే ఆధారాలను బట్టి మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఘటనకు ముందు భార్యాపిల్లలకు మత్తుమందు ఇచ్చారా లేదా ఏమైనా విషప్రయోగం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతామన్నారు.