Begin typing your search above and press return to search.

యువతితో ఇంటికి పిలిపించి.. మర్మాంగాలు కోసి దారుణ హత్య!

హైదరాబాద్‌ లో హనీట్రాప్‌ తో ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది.

By:  Tupaki Desk   |   9 Feb 2024 7:07 AM GMT
యువతితో ఇంటికి పిలిపించి.. మర్మాంగాలు కోసి దారుణ హత్య!
X

హైదరాబాద్‌ లో హనీట్రాప్‌ తో ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. నిందితుడు పక్కా ప్రణాళిక ప్రకారం ఒక యువతితో వ్యాపారికి ఫోన్‌ చేయించి ఆమె ఇంటికి రప్పించాడు. ఆ తర్వాత అతిదారుణంగా మర్మాంగాలు కోసేసి హత్య చేశాడు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటంకు చెందిన పుట్టా రాము అలియాస్‌ సింగోటం రాము అలియాస్‌ రమణ అలియాస్‌ రామన్న(36) రహమత్‌ నగర్‌ ప్రాంతంలో నివసించేవాడు. డ్రైవర్‌గా పని చేస్తూ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో బాగా సంపాదించాడు.

రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేయాలని ఆశిస్తున్న రామన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరిట సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేశాడు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ ప్రాంతంలో వివిధ సేవా కార్యక్రమాలు చేశాడు. ఎప్పుడూ ఒంటి మీద అర కిలో బంగారు ఆభరణాలు ధరించే రామన్న ‘గోల్డ్‌మ్యాన్‌’ గానూ పేరు తెచ్చుకున్నాడు. రాజకీయాల మీద ఆసక్తితో బీజేపీలో చేరాడు.

కాగా రెండేళ్ల క్రితం వ్యాపార విషయంలో లావాదేవీకి సంబంధించి హైదరాబాద్‌ లోని జీడిమెట్ల పోలీసు స్టేషన్‌ పరిధిలోని రాంరెడ్డినగర్‌ కు చెందిన మణికంఠపై రామన్న దాడికి దిగారు. ఈ ఘటనలో మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. ముఖానికి బాగా గాయాలు కావడంతో మణికంఠ ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.

కాగా రామన్న యూసుఫ్‌ గూడ లక్ష్మీనర్సింహనగర్‌ లో నివసించే ఓ మహిళ ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఆమెపై పలు పోలీసు స్టేషన్లలో వ్యభిచారం కేసులు ఉన్నాయని చెబుతున్నారు. తరచూ ఆమె ఇంటికి వెళ్లే రామన్న ఆమె కుమార్తెను కొంత కాలంగా ఇబ్బంది పెడుతున్నాడని తెలుస్తోంది. దీంతో ఆ యువతి తనకు దగ్గరగా ఉండే ఓ యువకుడికి ఈ విషయం చెప్పుకుని బాధపడింది. ఆ యువకుడు మణికంఠకు స్నేహితుడు కావడంతో ఇద్దరూ కలిసి రామన్నను హత్య చేయాలని కుట్ర పన్నారు.

తమ ప్రణాళికలో భాగంగా ఆ యువతి ఫిబ్రవరి 7 రాత్రి రామన్నకు ఫోన్‌ చేసింది. తన ఇంటికి రావాలని ఆహ్వానించింది. దీంతో రామన్న మద్యం బాటిల్‌ తీసుకుని యువతి ఇంటికి వెళ్లాడు. రామన్న ఇంటికి రాగానే యువతి.. తన స్నేహితుడైన యువకుడికి సమాచారం ఇచ్చింది.

దీంతో ఆ యువకుడితోపాటు బోరబండలో నివసించే రౌడీ షీటర్‌ జిలానీ, మణికంఠ సహా మొత్తం పది మంది కత్తులతో యువతి ఇంటికి చేరుకున్నారు

రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి రామన్నపై కత్తులతో విరుచుకుపడ్డారు. అతడి మర్మాంగాలను కోసేశారు. దీంతో అతడు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించాడు.

హత్య తర్వాత మణికంఠ.. రామన్న బామ్మర్దికి వీడియో కాల్‌ చేసి ‘నీ బావ చనిపోయాడు.. వచ్చి తీసుకెళ్లు’ అంటూ చూపించడంతో హత్య విషయం వెలుగుచూసింది. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పరారీ కాగా యువతి మాత్రం అక్కడే ఉంది.

కాగా హత్య తర్వాత తాను నివాసం ఉండే రాంరెడ్డినగర్‌ ప్రాంతానికి చేరుకొన్న మణికంఠ, అక్కడ తన మిత్రులతో కలిసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నాడు.

ఫిబ్రవరి 9న ఉదయం మణికంఠ, జిలానీ మరో ముగ్గురు కలిసి కత్తులతో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. సదరు యువతిని సైతం అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. మిగతా నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.