భార్య బాధితుడి వ్యధ: నిద్ర వేళ కర్రతో కొడుతూ.. యాసిడ్ పోసే ప్రయత్నం
భార్యలు పెట్టే వేధింపుల పేరుతో వేసే కామెడీ జోకులు అన్నిఇన్ని కావు.
By: Tupaki Desk | 22 Oct 2023 5:44 AM GMTభార్యలు పెట్టే వేధింపుల పేరుతో వేసే కామెడీ జోకులు అన్నిఇన్ని కావు. అయితే.. తాజాగా వెలుగు చూసిన ఒక ఉదంతం గురించి వింటే మాత్రం.. ఇంతలా టార్చర్ చేసే భార్య ఉంటుందా?అన్న సందేహం కలుగుతుంది. ఒంటి నిండా దెబ్బలతో.. తల కట్టుతో తనను తన భార్య నుంచి రక్షించాలంటూ పరుగులు తీసుకుంటూ పోలీసు స్టేషన్ కు వచ్చిన ఒక భార్య బాధితుడి ఉదంతం షాకింగ్ గా మారింది.
తన భార్య పెట్టే చిత్రహింసలు తట్టుకోవటం తన వల్ల కావట్లేదంటూ యూపీలోని మీరట్ జిల్లాకు చెందిన ఒక భర్త వేదన ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇలా కూడా చేస్తారా? అన్న సందేహం ఒక పక్క.. మరోవైపు భర్త వెర్షన్ తప్పించి.. భార్య ఎందుకిలా చేస్తుందన్న అప్డేట్ లేకపోవటంతో విషయం పూర్తిగా అర్థం కాని పరిస్థితి. అయితే.. ఈ ఎపిసోడ్ లో భర్త బాధితుడు కావటంతో అతగాడి వ్యధ వింటే మాత్రం దిమ్మ తిరగాల్సిందే.
మీరట్ నగరంలోని మేవ్ గఢీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నదీం అనే యువకుడు తలకు కట్టుతో పెద్ద ఎత్తున ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసుకుంటూ వచ్చాడు. తనను తన భార్య నుంచి కాపాడాలని ప్రాధేయపడటం మొదలుపెట్టాడు. అతడ్ని కుదుటపరిచి.. అసలేం జరిగిందో చెప్పమన్న పోలీసులకు తన గోడును చెప్పుకొచ్చాడు. తన భార్య తనను రోజూ టార్చర్ పెడుతోందని.. రక్తం వచ్చేలా కొడుతుందని చెప్పారు. తనను ఒక మనిషిలా కూడా చూడటం లేదని వాపోయాడు.
తాజాగా తాను నిద్రపోతున్న వేళలో.. అర్థరాత్రి వేళలో కర్రతో విపరీతంగా కొడుతుండటంతో నొప్పితో నిద్ర లేచానని.. ఆ సమయంలో తన భార్య యాసిడ్ పోసేందుకు ప్రయత్నిస్తున్న వైనాన్ని గుర్తించి.. ఇంట్లోనుంచి బయటకు పరుగులు తీసినట్లుగా చెప్పాడు.అయినప్పటికి తనను వదలకుండా కర్రతో కొడుతూనే ఉందన్నాడు. అతడు చెప్పేదంతా విన్న పోలీసులు.. అతడి ఫిర్యాదును నమోదు చేసి.. కేసు కట్టారు. భర్త వెర్షన్ ఇలా ఉంటే.. భార్య ఎందుకిలా చేస్తుందన్న విషయం మాత్రం పోలీసుల దర్యాప్తులో తేలనుంది. భార్య బాధితుడి గోడు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.