Begin typing your search above and press return to search.

వెంచర్ చూపిస్తామని చెప్పి తీసుకెళ్లి రేప్ చేసిన సహోద్యోగులు!

కడప జిల్లాకు చెందిన పాతికేళ్ల యువతి డిగ్రీ వరకు చదువుకొని జాబ్ కోసం హైదరాబాద్ కు వచ్చింది. మియాపూర్ లోని ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో ట్రైనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా చేరింది.

By:  Tupaki Desk   |   4 July 2024 5:35 AM GMT
వెంచర్ చూపిస్తామని చెప్పి తీసుకెళ్లి రేప్ చేసిన సహోద్యోగులు!
X

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగ విధుల్లో భాగంగా సైట్ విజిట్ మీటింగ్ పేరుతో ఒక యువతిని సంస్థకు చెందిన ఇద్దరు సహోద్యోగులు తమతో తీసుకెళ్లి రేప్ చేసిన వైనం వెలుగు చూసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ ఆరాచకం బయటకు వచ్చింది. తొలుత అత్యాచారయత్నం అన్న మాట వినిపించినప్పటికీ.. పోలీసుల విచారణ.. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగిందన్న విషయం వెల్లడైంది. తమతో కారులో తీసుకెళ్లిన సదరు సహోద్యోగులు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. మత్తు మందు కలిపిన స్వీట్లను ఆమె చేత తినిపించి.. కూల్ డ్రింక్ తాగించారు. మత్తులో స్ప్రహ కోల్పోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. సంచలనంగా మారిన ఈ దారుణ ఉదంతంలోకి వెళితే..

కడప జిల్లాకు చెందిన పాతికేళ్ల యువతి డిగ్రీ వరకు చదువుకొని జాబ్ కోసం హైదరాబాద్ కు వచ్చింది. మియాపూర్ లోని ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో ట్రైనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా చేరింది. అక్కడే హాస్టల్ లో ఉంటోంది. అదే సంస్థలో కర్నూలు జిల్లాకు చెందిన జనార్ధన్ (26), కడప జిల్లాకు చెందిన సంగారెడ్డి (27)లు కూడా పని చేస్తున్నారు. సంగారెడ్డికి సొంతంగా కారు ఉంది.

గత నెల 30న యాదగిరిగుట్ట సమీపంలో సంస్థకు చెందిన వెంచర్ ఉందని.. దాన్ని చూపించేందుకు తాము వెళుతున్నట్లుగా చెప్పారు. సైట్ విజిట్ తో పాటు.. మీటింగ్ కూడా ఉందని చెప్పటంతో ఆమె వారి మాటల్ని నమ్మింది. వారితో సమావేశానికి వెళ్లిన ఆమె.. తిరుగు ప్రయాణం అయ్యేసరికి రాత్రి అయ్యింది. రాత్రి పదిన్నర గంటల వేళలో కారు ఆపారు. ఎందుకు ఆపారంటే.. కారు చెడిపోయిందని అబద్ధం చెప్పారు. ఆమె తినేందుకు మత్తుమందు కలిపిన స్వీట్లు, కూల్ డ్రింక్ ఇచ్చారు. ఆకలిగా ఉండటంతో వాటిని తిన్న ఆమె కాసేపటికే మత్తులోకి జారిపోయింది.

దీంతో ఒకరి తర్వాత ఒకరు ఆమెను అత్యాచారం చేశారు. తర్వాత అదే వాహనంలో తెల్లవారుజామున మూడు గంటల వేళలో ఆమెను హాస్టల్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. తనకు జరిగిన ఘటనపై బాధితురాలు స్నేహితురాలి సాయంతో పోలీసులకు సమాచారం అందించి.. ఫిర్యాదు చేసింది. తొలుత ఈ కేసును ఉప్పల్ లో నమోదు చేయగా.. తర్వాత మియాపూర్ కు బదిలీ చేశారు. నిందితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

ఇదిలా ఉంటే.. సదరు రియల్ ఎస్టేట్ సంస్థ మాత్రం.. బాధితురాలు తమ ఉద్యోగిని కాదని.. తాము ట్రైనీలను అపాయింట్ చేసుకోమంటూ ప్రకటన జారీ చేయటం గమనార్హం. అయితే.. ఈ వివాదంలో తమకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఇలాంటి ప్రకటన ఇచ్చి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాంకేతిక కారణాలు చూపించి.. తమ బాధ్యత నుంచి తప్పించుకోవటానికి సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ప్రయత్నిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే.. పోలీసులు ఈ అంశం మీదా విచారణ జరుపుతున్నారని.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తారని చెబుతున్నారు.