Begin typing your search above and press return to search.

లండన్‌ లో హైదరాబాదీ దారుణ హత్య.. ఈనెల 5న కూతురు పెళ్లి!

అవును... హైదరాబాద్‌ వాసి విదేశంలో దారుణ హత్యకు గురయ్యారు. ఉపాధి కోసం లండన్‌ వెళ్లిన మహమ్మద్‌ ఖాజా రయీస్ ఉద్దీన్‌ (65) ని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశాడు.

By:  Tupaki Desk   |   3 Oct 2023 10:55 AM GMT
లండన్‌  లో హైదరాబాదీ దారుణ హత్య.. ఈనెల 5న కూతురు పెళ్లి!
X

ఈ మధ్యకాలంలో విదేశాల్లో భారతీయులపై జరుగుతున్న దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో మగ్గింగ్ పేరున జరుగుతున్న దోపిడీలు, వీకెండ్స్ లో వినిపిస్తున్న తుపాకీల చప్పుళ్లు మరింత ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా లండన్ లో హైదరాబాదీ వాసి హత్యకు గురయ్యారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

అవును... హైదరాబాద్‌ వాసి విదేశంలో దారుణ హత్యకు గురయ్యారు. ఉపాధి కోసం లండన్‌ వెళ్లిన మహమ్మద్‌ ఖాజా రయీస్ ఉద్దీన్‌ (65) ని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశాడు. డబ్బుల కోసమే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ సమయంలో ఖాజా తోపాటు ఆఫ్ఘాన్ కు చెందిన మరో వ్యక్తి కూడా హత్యకు గురయ్యాడు!

వివరాళ్లోకి వెళ్తే... మహమ్మద్‌ ఖాజా రయిస్‌ ఉద్దీన్‌ 2011లో ఉపాధి కోసం హైదరాబాద్ నుంచి లండన్‌ వెళ్లాడు. ఈ క్రమంలో తన తన స్నేహితుడితో కలిసి వెళుతుండగా ఉంగాడా దేశానికి చెందినవారిగా చెబుతున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వీరిపై దాడికి యత్నించారు. ఈ దాడిలో వారి చేతిలో ఖాజా కత్తిపోట్లకు గురై మరణించారు.

ఇదే సమయంలో ఖాజాతోపాటు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన మరో వ్యక్తిని సైతం నిందితులు అదే కత్తితో పొడిచి చంపారు. డబ్బుల కోసం వీరితో గొడవపడిన దుండగులు, డబ్బులు ఇవ్వడానికి వీరు నిరాకరించేసరికి కత్తితో పొడిచి హత్య చేసి పరారైనట్లు అనుమానిస్తున్నారు.

కాగా, ఈ నెల 5న హైదరాబాద్‌ లో మహమ్మద్‌ ఖాజా కుమార్తె వివాహం ఉంది. దీంతో కూతురు పెళ్లి కోసం ఆయన హైదరాబాద్‌ కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క పెళ్లి ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు. ఇళ్లంతా పెళ్లి వాతావరణంతో సందడిగా మారింది. సరిగ్గా ఈ సమయంలోనే దారుణం జరిగిపోయింది.. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ వార్త విని షాక్ కి గురయ్యారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయామంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.