గుండె గుభిల్లడం ఖాయం.. సైబర్ నేరాల్లో భారత్ స్థానం ఇదే!
కంప్యూటర్ నెట్ వర్క్, ఎలక్ట్రానిక్ డివైజ్ నెట్ వర్క్ లే లక్ష్యంగా చేసే నేరాలనే సైబర్ నేరాలంటారనే విషయం తెలిసిందే
By: Tupaki Desk | 12 April 2024 5:23 AM GMTకంప్యూటర్ నెట్ వర్క్, ఎలక్ట్రానిక్ డివైజ్ నెట్ వర్క్ లే లక్ష్యంగా చేసే నేరాలనే సైబర్ నేరాలంటారనే విషయం తెలిసిందే. ప్రధానంగా అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకునేవారు, ఆన్ లైన్ ద్వారా మోసం చేయాలనుకునేవారు సైబర్ నేరాలు చేస్తుంటారు. వ్యక్తుల ధనానికే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ రక్షణకు కూడా సైబర్ నేరాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి.
ఈ నేపథ్యంలో ప్రపంచంలో సైబర్ నేరాలు జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా చోటు దక్కించుకోవడం గమనార్హం. సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే పదో స్థానంలో ఉంది. దీన్నిబట్టి మనదేశంలో ఏ స్థాయిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
ముఖ్యంగా శత్రు దేశాలు చైనా, పాకిస్థాన్ లతోపాటు అక్రమంగా డబ్బు సంపాదించాలనుకుంటున్న నేరగాళ్లు.. నైజీరియా, కంబోడియా, సూడాన్ తదితర దేశాల్లో ఉండి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
ఈ మేరకు తాజా అధ్యయనం ఒకటి బాంబుపేల్చింది. దాదాపు 100 దేశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం అధ్యయనం చేసి ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ను రూపొందించింది. తన అధ్యయనంలో ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ సైబర్ నేరాలు జరుగుతున్నాయో వెల్లడించింది.
వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ప్రకారం.. సైబర్ నేరాలు ఎక్కువగా రష్యాలో జరుగుతున్నాయి. రెండో స్థానంలో ఉక్రెయిన్, మూడో స్థానంలో చైనా, నాలుగో స్థానంలో అమెరికా, ఐదో స్థానంలో నైజీరియా, ఆరో స్థానంలో రుమేనియా, ఏడో స్థానంలో ఉత్తర కొరియా, ఎనిమిదో స్థానంలో బ్రిటన్, తొమ్మిదో స్థానంలో బ్రెజిల్ ఉన్నాయి.
రష్యా, ఉక్రెయిన్ ల్లో టెక్నాలజీ చోరీ జరుగుతోందని సర్వే తేల్చింది. మిగతా దేశాల్లో కొన్నిచోట్ల హైటెక్, మరికొన్ని చోట్ల లోటెక్ నేరాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది.
కాగా భారత్ లో సైబర్ నేరాలకు సంబంధించి ఆసక్తికర విషయం వెల్లడైంది. ‘మీకు ఫలానా లాటరీ వచ్చింది. మీకు కోట్ల రూపాయల బహుమతి వచ్చింది. వీటిని అందుకోవాలంటే ముందు మీరు వివిధ రకాల పన్నులు, రుసుంల కింద కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది’ అంటూ లక్షల రూపాయల్లో సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాప్ చేసుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ ఫోన్లు విదేశాల నుంచి వచ్చినట్టు తేలుతోంది. భారత్ లో చోటు చేసుకుంటున్న సైబర్ నేరాల్లో ఎక్కువ శాతం ఇలాంటివేనని సైబర్ క్రైమ్ ఇండెక్స్ వెల్లడించింది.
వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ సర్వే ప్రకారం.. ప్రపంచంలో ప్రధానంగా జరుగుతున్న సైబర్ నేరాలను అంతర్జాతీయ నిపుణులు గుర్తించారు. వీటిలో సైబర్ దాడులు, అక్రమ వర్చువల్ కరెన్సీతో మనీలాండరింగ్, మాల్వేర్ ఉత్పత్తులు, సర్వీసులు, హ్యాకింగ్, డేటాను దొంగిలించడం, ముందస్తు చెల్లింపు మోసాలు, డబ్బును దొంగిలించడం, రాన్సమ్ వేర్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్టు, ఓటీపీ వివరాల తస్కరణ వంటివి ఉన్నాయి.