Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురి మృతికి కారణం ఏంటి..? మిస్టరీ వీడేనా..?

అసలు ఈ ముగ్గురు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న ప్రశ్నలు అందరి మదిని తొలుస్తున్నాయి. మూడు రోజులైనా ఇంకా ఆ మిస్టరీ వీడడం లేదు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 9:09 AM GMT
ఆ ముగ్గురి మృతికి కారణం ఏంటి..? మిస్టరీ వీడేనా..?
X

ఓ ఎస్ఐ, ఓ మహిళా కానిస్టేబుల్, ఓ కంప్యూటర్ ఆపరేటర్.. కామారెడ్డిలో వీరి మృతి ఇప్పుడు రాష్ట్రవ్యా్ప్తంగానూ కలకలం రేపింది. అసలు ఈ ముగ్గురు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న ప్రశ్నలు అందరి మదిని తొలుస్తున్నాయి. మూడు రోజులైనా ఇంకా ఆ మిస్టరీ వీడడం లేదు.

కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్ఐ సాతెల్లి సాయికుమార్(31), బీబీపేట పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శృతి(28), బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న తోట నిఖిల (28).. ఈ ముగ్గురూ సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో నిఖిల్, శతి మృతదేహాలు బుధవారం రాత్రి లభించాయి. ఎస్ఐ డెడ్‌బాడీ నిన్న ఉదయం లభించింది. కాగా.. ఈ ముగ్గురి మృతదేహాలకు కామారెడ్డి జిల్లా హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం డెడ్‌బాడీలను కుటుంబ సభ్యులకు అందించారు.

సంబంధం లేకుండా ముగ్గురు వేర్వేరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడంపై మిస్టరీగా మారింది. మెదక్ జిల్లా కొల్చారానికి చెందిన సాయికుమార్ 2018లో ఎస్ఐగా ఎంపికయ్యారు. గతేడాది కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఆయన భిక్కనూరు ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య లక్ష్మి, మూడేళ్ల కొడుకు ఉన్నారు. లక్ష్మి మళ్లీ గర్భిణి. మహిళా కానిస్టేబుల్ శృతిది గాంధారి మండల కేంద్రం. పదేళ్ల క్రితం ఉద్యోగంలో చేరారు. పెళ్లయిన తర్వాత కొన్నాళ్లకు భర్తతో విడాకులు తీసుకుంది. మూడేళ్లుగా బీబీపేట స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. సాయికుమార్ బీబీపేటలో విధులు నిర్వర్తించినప్పుడు అక్కడే శృతితో పరిచయం ఏర్పడినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు.. బీబీపేటకు చెంది నిఖిల్ కంప్యూటర్ హార్డ్‌వేర్. ఇతని ఇంటికి సమీపంలోనే శృతి కిరాయికి ఉంటోంది. కాగా.. వీరి ముగ్గురు మధ్య పరిచయం ఏమైనా ఉన్నదా అని పోలీసులు విచారిస్తున్నారు.

శృతి బుధవారం పొద్దున విధులు ముగించుకొని ఆ తర్వాత సొంతూరు గాంధారికి వస్తున్నట్లుగా తన తల్లి విజయకు ఫోన్‌లో చెప్పింది. ఆ తరువాత కొద్ది సేపటికే ఫోన్ చేస్తే తాను సగం దూరం వచ్చానని.. కానీ డ్యూటీ ఉందని మళ్లీ స్టేషన్‌కు రమ్మంటున్నట్లు తెలిపింది. అయితే.. మధ్యాహ్నం తరువాత విజయ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మరోవైపు.. ఎస్ఐ సాయికుమార్ బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తన సొంత కారులో క్వార్టర్ నుంచి వెళ్లారు. ఎక్కడికి వెళ్లేది ఎవరికీ చెప్పలేదు. వెళ్లే సమయంలో ఇల్లుకు తాళం కూడా వేయలేదు. ఆయన నాలుగు రోజుల క్రితమే తన భార్య లక్ష్మిని ఇంటి దగ్గర దింపి వచ్చారు.

సాయికుమార్ బుధవారం పొద్దున్నే తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇంటికి వస్తానని చెప్పారు. మరోవైపు ఆపరేటర్ నిఖిల్ 11 గంటల వరకు బీబీపేటలోనే ఉన్నాడు. ఇంట్లో తిని బయటకు వెళ్లినట్లు అతని తల్లి స్వరూప చెబుతోంది. కాగా.. శృతి ఫోన్ కలవకపోవడంతో కుటుంబసభ్యులు బీబీపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఈ విషయం ఉన్నతాధికారులు తెలిసి సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేపట్టారు. లొకేషన్ అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఏరియాలో చూపించింది. దాంతో సిబ్బంది అక్కడికి వెళ్లి చూడగా.. చెరువు ఒడ్డున సెల్ ఫోన్ కనిపించింది.

అయితే.. అక్కడ సమీపంలో సాయికుమార్ కారు ఉంది. అదే కారులో శృతి బ్యాగు ఉన్నట్లు చూశారు. ఎస్ఐ సెల్ ఫోన్ అతని ప్యాంటు జేబులోనే ఉండగా.. మిగితా ఇద్దరి ఫోన్లు మాత్రం చెరువు గట్టున దొరికాయి. ఇదిలా ఉండగా.. వీరు ముగ్గురు కారులోనే వచ్చినట్లు అనుమానిస్తున్నారు. అసలు వీరు ముగ్గురు ఎక్కడ కలుసుకున్నారు..? చెరువు వద్దకు ఎందుకు వచ్చారు..? ఆత్మహత్య చేసుకున్నారా..? ఇంకా ఏమైనా జరిగిందా..? అసలు వీరి చవుకు కారణాలు ఏంటి..? అనేది తెలియకుండా ఉంది. ఈ కేసు దర్యాప్తులో మృతుల సెల్‌ఫోన్లు, పోస్టుమార్టం రిపోర్టులే కీలకంగా మారాయి.