సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు సూసైడ్ చేసుకున్న వృద్ధ దంపతులు
సైబర్ నేరగాళ్ల అరాచకాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కంటికి కనిపించకుండా మాటలతో కోట్లు కొల్లగొడుతున్న వారి ఆశ చావటం లేదు
By: Tupaki Desk | 29 March 2025 4:09 AMసైబర్ నేరగాళ్ల అరాచకాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కంటికి కనిపించకుండా మాటలతో కోట్లు కొల్లగొడుతున్న వారి ఆశ చావటం లేదు. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించే విషయంలో ప్రభుత్వం సరైన రీతిలో స్పందించటం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించే విషయంలో పోలీసులు ప్రయత్నం చేస్తున్నా.. మిగిలిన వ్యవస్థలు వారి మాదిరి చురుగ్గా వ్యవహరించని పరిస్థితి. దీంతో.. సైబర్ నేరాలు అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి. తాజాగా కర్నాటకలో చోటు చేసుకున్న విషాద ఉదంతం చూస్తే అయ్యో అనిపించక మానదు.
ఒక వృద్ధ జంటను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అమానవీయంగా వ్యవహరించారు. రూ.50 లక్షల వరకు గుంజినా.. వారిని వదలకుండా వెంటాడటం.. బెదిరింపులకు పాల్పడుతున్న ఉదంతాలతో భయానికి గురైన వారు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 83 ఏల్ల డియాగో నజరత్.. 79 ఏళ్ల పావియాలు కర్ణాటకలోని ఖానాపూర తాలూకా బీడి గ్రామంలో ఉంటున్నారు.
ఆయన గతంలో రైల్వే శాఖలో కీలక స్థానాల్లో పని చేసి రిటైర్ అయ్యారు. కొద్ది రోజులుగా ఆయనకు సైబర్ నేరగాళ్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ‘మీ ఫోటో గుర్తింపు కార్డులను వినియోగించుకొని కొందరు సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ఈ కేసులో మిమ్మల్ని విచారణ చేయాల్సి ఉంటుంది. నేరం రుజువైతే అరెస్టు చేయాల్సి ఉంటుంది’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీని నుంచి బయటపడేందుకు ఇప్పటివరకు సైబర్ నేరగాళ్లకు రూ.50 లక్షల వరకు బదిలీ చేశారు.
అయినా.. సైబర్ నేరగాళ్ల ఆశ తీరలేదు. మరింత డబ్బులు పంపాలని వారిపై ఒత్తిడి చేయసాగారు. ఈ ఒత్తిళ్లు తీవ్రం కావటంతో.. ఈ వృద్ధ దంపతులు తీవ్రమైన మనోవ్యధకు గురై.. చివకు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా మరింత అప్రమత్తంగా ఉండటమే కాదు.. ఎవరైనా తప్పుడు బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే.. ఫలితం సానుకూలంగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.