టిఫిన్ బాక్సులో ఐఈడీ... కేరళలో జరిగిన పేలుళ్లలో ఎన్ఐఏ ఎంట్రీ!
ఆదివారం ఉదయం కేరళలో జరిగిన పేలుళ్ల ఘటన స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది.
By: Tupaki Desk | 29 Oct 2023 10:31 AM GMTఆదివారం ఉదయం కేరళలో జరిగిన పేలుళ్ల ఘటన స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్నాకుళం జిల్లా కాలామస్సెరిలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఉదయం 9:30 గంటల ప్రాంతాంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో ఈ పేలుళ్లలో ఉగ్రవాద కుట్ర ఏమైనా ఉందా అనే ఆలోచనతో వెంటనే ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
అవును... ఆదివారం ఉదయం కాలామస్సెరి నెస్ట్ సమీపంలోని కన్వెన్షన్ సెంటర్ లో క్రైస్తవుల ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనకు వరపుజ, ఎడపల్లి అంగమలి తదితర మండలాల నుంచి వందల సంఖ్యలో జనం తరలివచ్చారట. సరిగ్గా అదేసమయంలో... అకస్మాత్తుగా జనం మధ్యలో పేలుడు సంభవించింది. 5 నిమిషాల వ్యవధిలోనే వరుసగా రెండు పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
తాజాగా ఈ విషయాలపై కేరళ డీజీపీ షేక్ దార్వేశ్ సాహెబ్ స్పందించారు. ఇందులో భాగంగా... కలమస్సెరీలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 9:40కి పేలుడు సంభవించిందని.. ప్రత్యక్షసాక్షులు చెప్పిన వివరాల ప్రకారం రెండు పేలుళ్లు జరిగినట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో... భారీ పేలుడు పదార్థం ఐఈడీ కారణంగానే ఇది సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని.. పేలుళ్లకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఇదే సమయంలో... ఈ పేలుళ్లలో ఉగ్రకోణం ఏమైనా ఉందా అనే విషయం దర్యాప్తు తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమని.. ఇందులో భాగంగా పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో ఇప్పటికే ఘటనా స్థలానికి ఎన్ఐఏ తోపాటు ఇతర దర్యాప్తు సంస్థలు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాలను కేరళ మంత్రులు వీఎన్ వాసవన్, ఆంటోనీ రాజు ధృవీకరించారు.
ఇక, ఈ పేలుళ్లలో సుమారు 40 మంది గాయపడగా.. అందులో 10 మంది 50 శాతం కంటే ఎక్కువ కాలిన గాయాలతో చికిత్స తీసుకుంటున్నట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో... ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. 14 జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, ద్వేషపూరిత మెసేజ్ లు వంటీవి వ్యాప్తి చేయొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ పేలుళ్ల అనంతరం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారని తెలుస్తుంది. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను ఆరా తీయడంతోపాటు, దర్యాప్తు కోసం కేంద్ర దర్యాప్తు బృందాలను పంపించినట్లు చెప్పారని అంటున్నారు.
కాగా... పేలుళ్లు జరిగిన సమయమంలో కన్వెన్షన్ హాలులో దాదాపు 2,500 మంది ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జి.. అధికారులను ఆదేశించారు. బాధితులను కాలామస్సేరి మెడికల్ కాలేజీ, ఎర్నాకులం జనరల్ హాస్పిటల్, కొట్టాయం మెడికల్ కాలేజీలకు తరలించారు!