అప్పు తిరిగి ఇవ్వట్లేదని ఏసీపీ కొడుకును చంపేశారు
దారిమధ్యలో పానిపట్ వద్ద బాత్రూం కోసం కారు ఆపిన వేళ.. కాల్వలోకి లక్షయ్ ను వికాస్ తోసేసినట్లుగా పేర్కొన్నాడు. అదే కారులో వికాస్ తనను ఢిల్లీలో వదిలిపెట్టినట్లుగా చెప్పాడు.
By: Tupaki Desk | 27 Jan 2024 7:47 AM GMTడబ్బుల వివాదంలో ఒక యువ న్యాయవాది హత్యకు గురయ్యాడు. మరో విషయం ఏమంటే.. సదరు లాయర్ ఒక ఏసీపీ కొడుకు కావటం. హర్యానాలోని పానిపట్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఈ హత్య కేసును ట్రాక్ చేసిన పోలీసులు ఒక నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందన్నది చూస్తే..
ఢిల్లీలో ఏసీపీగా పని చేసే యశ్ పాల్ చౌహాన్ కుమారుడు లక్షయ్ చౌహాన్. 26 ఏళ్ల అతను లాయర్ గా పని చేస్తుంటాడు. అతను తన స్నేహితులు వికాస్.. అభిషేక్ లతో కలిసి ఈ నెల 22న బంధువుల పెళ్లికి కారులో వెళ్లాడు. పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఇంటికి రాలేదు. దీంతో.. అతడి తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
లక్షయ్ తో పాటు పెళ్లికి కారులో వెళ్లిన అభిషేక్ ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకొని విచారించగా.. షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. తాను.. వికాస్.. లక్షయ్ ముగ్గురం కారులో సోనెపట్ కు వెళ్లామని.. పెళ్లి తర్వాత అదే రోజు రాత్రి ఇంటికి బయలుదేరినట్లుగా చెప్పాడు. దారిమధ్యలో పానిపట్ వద్ద బాత్రూం కోసం కారు ఆపిన వేళ.. కాల్వలోకి లక్షయ్ ను వికాస్ తోసేసినట్లుగా పేర్కొన్నాడు. అదే కారులో వికాస్ తనను ఢిల్లీలో వదిలిపెట్టినట్లుగా చెప్పాడు.
దీంతో.. నిందితుడు వికాస్ భరద్వాజ్ కోసం పోలీసులు వెతుకుతూ.. అభిషేక్ చెప్పిన ప్రాంతానికి వెళ్లి.. డెడ్ బాడీ కోసం వెతుకుతున్నారు. వికాస్ భరద్వాజ్ తీస్ హజారీ కోర్టులో క్లర్క్ గా పని చేస్తుంటానని.. అతడి దగ్గర డబ్బులు తీసుకున్న లక్షయ్.. తిరిగి ఇవ్వలేదని.. ఎన్నిసార్లు అడిగినా స్పందించకపోవటంతో కోపం పెంచుకున్న అతడు హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఈ హత్యకు అభిషేక్ ను వాడుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో.. ఈ ఇద్దరి మీద పోలీసులు కేసులు నమోదు చేసి.. హత్య చేసిన వికాస్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.