Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ దారుణం.. వెలుగులోకి మరిన్ని విస్మయకర అంశాలు!

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో తనను ప్రేమించడం లేదనే కారణంతో సంఘవి అనే యువతిపై శివకుమార్‌ అనే యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Sep 2023 10:06 AM GMT
హైదరాబాద్‌ దారుణం.. వెలుగులోకి మరిన్ని విస్మయకర అంశాలు!
X

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో తనను ప్రేమించడం లేదనే కారణంతో సంఘవి అనే యువతిపై శివకుమార్‌ అనే యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీన్ని అడ్డుకోబోయిన ఆమె తమ్ముడు పృథ్వీని విచక్షణారహితంగా కత్తి పెట్టి పొడవడంతో అతడు మరణించాడు. కాగా నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సంఘవిని మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆమె తమ్ముడు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు.

కాగా తమ సోదరుడిని చంపడంతోపాటు తమ అక్క పాశవికంగా దాడి చేసిన శివకుమార్‌ ను కఠినంగా శిక్షించాలని సంఘవి సోదరులు శ్రీనివాస్, రోహిత్‌ డిమాండ్‌ చేశారు. గతంలోనే నిందితుడు తమ అక్కను వేధిస్తుండటంతో అతడిని హెచ్చరించానని రోహిత్‌ వెల్లడించాడు. అయితే ఇలాంటిది జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

శివకుమార్‌ మాత్రమే కాకుండా అతడి అక్క కూడా శివ కుమార్‌ ను పెళ్లి చేసుకోవాలని తమ అక్కను పలుమార్లు వేధించిందని ఆరోపించాడు. శివకుమార్‌ తన అక్కను పదో తరగతి నుంచి వేధిస్తున్నాడని రోహిత్‌ వెల్లడించాడు. తన సోదరుడు, అక్కపై శివకుమార్‌ దాడి చేసిన విషయం తెలిసి ఎల్బీ నగర్‌ వెళ్లానని.. గది అంతా రక్తపు మరకలతో నిండి పోయిందని రోహిత్‌ తెలిపాడు.

ఈ నేపథ్యంలో శివకుమార్‌ ను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరాడు. అతడు జైలు నుంచి బయటకు వస్తే తమ అక్క ప్రాణాలకు మరోమారు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.

బాధితురాలు సంఘవి మరో సోదరుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. పదో తరగతి నుంచి సంఘవిని శివకుమార్‌ వేధిస్తున్నా.. ఇంట్లో చెబితే చదువు మానిపిస్తారని ఆ విషయాన్ని తనలోనే దాచుకుందని తెలిపాడు. అన్యాయంగా తమ తమ్ముడిని శివకుమార్‌ చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

కాగా నిందితుడు శివకుమార్‌ మానసిక ప్రవర్తన సరిగా లేదని.. గతంలో తండ్రి మందలించాడని అతడిని శివకుమార్‌ సుత్తితో కొట్టి చంపాడని పోలీసులు చెబుతున్నారు. అయితే తమకు ఒక్కడే కొడుకు అని.. పోలీసులకు చెప్పొద్దని అతడి తల్లి గ్రామస్తులను కోరడంతో ఆ విషయం పోలీసుల వరకు వెళ్లలేదని తెలుస్తోంది.