షాకింగ్: పంద్రాగస్టు రాత్రి యువతికి నరకం చూపిన ఎల్బీనగర్ ఖాకీలు!
ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు వ్యవహరించిన దుర్మార్గం బయటకు వచ్చి నిశ్చేష్టులుగా మార్చింది.
By: Tupaki Desk | 18 Aug 2023 4:32 AM GMTషాకింగ్ ఉదంతం కాస్తంత ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు బయటకు రావటం.. ఆమె ఆవేదన వాట్సాప్..సోషల్ మీడియాలో వైరల్ కావటంతో హైదరాబాద్ మహానగర పరిధిలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు వ్యవహరించిన దుర్మార్గం బయటకు వచ్చి నిశ్చేష్టులుగా మార్చింది. పంద్రాగస్టు రాత్రి వేళ చోటు చేసుకున్న ఈ ఉదంతం గురువారం (ఆగస్టు 17) ఉదయం బయటకు వచ్చింది.
ఆగస్టు 15 రాత్రి వేళఒక మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి.. అత్యంత అమానుషంగా.. దారుణంగా దాడికి పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది. తీవ్ర గాయాలైన ఆమెకు సంబంధించిన ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారాయి. దీంతో.. ఈ ఉదంతంపై తీవ్ర నిరసన రావటంతో.. దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివశంకర్.. మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ నిర్ణయం తీసుకున్నారు.ఇంతకూ అసలేం జరిగిందంటే..
ఆగస్టు 15 రాత్రి పదకొండు గంటల వేళలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఎల్బీనగర్ చౌరస్తాలో పోలీసులకు ముగ్గురు మహిళలు కనిపించారు. స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్నట్లుగా వారిని స్టేషన్ కు తీసుకొచ్చారు. వారిపై సెక్షన్ 290 కింద కేసు నమోదు చేశారు. వారిలో మీర్ పేట్ కు చెందిన మహిళ.. తనను ఎందుకు తీసుుకొచ్చారని గట్టిగా ప్రశ్నించారు. దీంతో.. విధుల్లో ఉన్న పోలీసులు ఆమెపై లాఠీలతో విరుచుకుపడ్డారు.
ఆమెను ఎంత దారుణంగా కొట్టారంటే.. ఆమె ఎడమ మోకాలి పైభాగం పూర్తిగా కమిలిపోయింది. అరికాళ్లపై బలంగా కొట్టిన కారణంగా ఆమె నడవలేని దుస్థితి నెలకొంది. రాత్రంతా స్టేషన్ లో ఉంచిన బాధిత మహిళను.. ఆగస్టు 16 ఉదయం స్టేషన్ నుంచి పంపేశారు. తీవ్ర గాయాలైన ఆమె ఇంటికి చేరుకున్నారు. ఈ వ్యవహారంలో ఎస్ఐ పాత్ర మీదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కుమార్తె పెళ్లి కోసం డబ్బులు తీసుకురావటానికి బయటకు వచ్చానని.. తెలిసిన వారి నుంచి డబ్బులు తీసుకొని వస్తుండగా పోలీసులు తనను స్టేషన్ కు తీసుకెళ్లారని బాధిత మహిళ ఆరోపిస్తోంది.
తనను స్టేషన్ కు తీసుకొచ్చిన సమయంలో తన వద్ద ఉన్న రూ.3 లక్షల మొత్తాన్ని లాక్కున్నట్లుగా ఆమె చెబుతున్నారు. తనపై పోలీసులు చేసిన దాడిపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తానెంత చెబుతున్నా వినకుండా తనను దారుణంగా కొట్టినట్లుగా పేర్కొన్నారు. మహిళ బంధువులు.. కుటుంబ సభ్యులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో.. వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున వైరల్ కావటంతో.. పోలీసులు స్పందించక తప్పని పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్ర వరకు సాగిన పలు పరిణామాల నేపథ్యంలో.. సాయంత్రానికి బాధ్యులుగా ఇద్దరు పోలీసుల్ని చూపిన అధికారులు వేటు వేశారు. ఒక మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ రాచకొండ కమిషనర్ కు ఆదేశించటంతో పాటు.. బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూస్తామన్న హామీ ఇచ్చారు. ఈ ఉదంతంపై పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.