Begin typing your search above and press return to search.

మదనపల్లెలో నడి రోడ్డు మీద టీచరమ్మ దారుణ హత్య

వేంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో డ్యూటీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు కదీర్ అహ్మద్. మదనపల్లి పట్టణంలో అతడు ఉంటాడు.

By:  Tupaki Desk   |   4 Aug 2023 5:24 AM GMT
మదనపల్లెలో నడి రోడ్డు మీద టీచరమ్మ దారుణ హత్య
X

స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న టీచరమ్మను మదనపల్లె పట్టణంలోని నడిరోడ్డు మీద దారుణంగా హత్య చేసిన ఉదంతం సంచలనంగా మారింది. సాయంత్రం వేళ.. టూవీలర్ మీద వెళుతున్న ఆమెను అడ్డుకున్న వారు.. కారం చల్లి.. ఆ వెంటనే ఆమె గొంతులోకి పదునైన కత్తిని దింపి హతమార్చారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఈ హత్య వెనుక ఏం జరిగిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చినా.. పెద్దగా స్పందించని వైనం ఈ దారుణ హత్యకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వేంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో డ్యూటీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు కదీర్ అహ్మద్. మదనపల్లి పట్టణంలో అతడు ఉంటాడు. అతనికి ఆరేళ్ల క్రితం రుక్సానాతో పెళ్లైంది. ఆమె ప్రైవేటు జూనియర్ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్ గా పని చేస్తున్నారు. పెళ్లై మూడేళ్లు అవుతున్నా వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో.. రుక్సానాను ఒప్పించి మదనపల్లెకు చెందిన అయేషాను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులు వీరి సంసారం సజావుగా సాగినా.. ఏడాదిన్నర క్రితం మొదటి భార్య రుక్సానాకు ఆడపిల్ల పుట్టింది. దీంతో, అప్పటి నుంచి కదీర్ మొదటి భార్య వద్దే ఉంటున్నాడు.

ఈ విషయం మీద రెండో భార్యకు కదీర్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. రుక్సానా కారణంగానే తన భర్త ఇంటికి రావటం లేదన్న ఆగ్రహాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మొదటి భార్య ఉందని తనకు చెప్పకుండానే మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నట్లుగా ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రుక్సానాతో పాటు.. భర్త కదీర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఇష్యూ కోర్టులో ఉంది.

తమ సోదరికి మోసం జరిగిందన్న ఆగ్రహంతో ఉన్న అయేషా సోదరులు రుక్సానాను టార్గెట్ చేశారు. ఆమె కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే వేళలో దాడి చేసేందుకు రెక్కీ నిర్వహించారు. ఈ విషయాన్ని గుర్తించిన రుక్సానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం కాలేజీ నుంచి టూ వీలర్ మీద ఇంటికి వస్తున్న రుక్సానాను అడ్డుకున్న ఇద్దరు.. ఆమె ముఖం మీద కారం చల్లి.. తేరుకునేలోపు గొంతులో పొడిచేశారు.

అటుగా వస్తున్న స్టూడెంట్స్ తమ టీచర్ మీద దాడి జరుగుతుండటంతో అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారు పారిపోయారు. అయితే.. తీవ్రంగా గాయపడిన రుక్సానా ప్రాణాలు వదిలారు.

ఈ హత్య గురించి సమాచారం అందుకున్నంతనే పోలీసులు.. అధికారులు.. ఉన్నతాధికారులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అయితే.. తాము కంప్లైంట్ ఇచ్చినంతనే చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని రుక్సానా కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ హత్య ఉదంతం మదనపల్లె పట్టణంలో సంచలనంగా మారింది.

పోలీసులు రంగంలోకి దిగి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అధికారికంగా మాత్రం ధ్రువీకరించటం లేదు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. తమ సోదరి జీవితానికి అడ్డుగా ఉన్న రుక్సాను అడ్డు తొలగించేందుకే హత్య చేసినట్లుగా పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.