Begin typing your search above and press return to search.

దేశ అధ్యక్షుడి హత్యలో భార్య, ప్రధాని హస్తం!

అవును... హైతీ దేశ మాజీ అధ్యక్షుడు జొవెనల్‌ మోయిస్‌ హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   20 Feb 2024 9:55 AM GMT
దేశ అధ్యక్షుడి హత్యలో భార్య, ప్రధాని హస్తం!
X

ఒక దేశ అధ్యక్షుడి హత్యలో అతని భార్యతో పాటు మాజీ ప్రధానమంత్రి, పోలీస్ మాజీ చీఫ్ ల పాత్ర ఉందంటూ విడుదలైన ఒక నివేదిక ఇప్పుడు వైరల్ గా మారింది. కాస్త ఆలస్యంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినప్పటికీ... ఇప్పుడు ఇవి సంచలనంగా మారాయి. ఇదే సమయంలో... ఈ కేసు విచారణ చేపట్టిన అధికారులు సైతం ప్రాణభయంతో విచారణ మధ్యలోనే వైదొలుగుతుండటం ఆసక్తిగా మారింది.

అవును... హైతీ దేశ మాజీ అధ్యక్షుడు జొవెనల్‌ మోయిస్‌ హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయన హత్యకేసులో ఆయన సతీమణిపైనే అభియోగాలు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఆమెతో పాటు ఆదేశ మాజీ ప్రధానమంత్రి, హైతీ నేషనల్ పోలీస్‌ మాజీ చీఫ్‌ పై అభియోగాలు మోపుతూ విచారణాధికారి నివేదిక విడుదల చేశారు.

ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... జొవెనెల్ మోయిస్‌ సతీమణి మార్టిన్‌ మోయిస్‌, మాజీ ప్రధాన మంత్రి క్లాడె జోసెఫ్ లు ఈ హత్యకు సహకరించారని.. ఇదే సమయంలో అప్పటి పోలీస్‌ చీఫ్ లియోన్‌ చార్లెస్‌ పైనా ఆరోపణలు చేశారు. దీంతో... వారిపై హత్య, అంతర్గత భద్రతకు వ్యతిరేకంగా కుట్ర వంటి అభియోగాలు నమోదయ్యాయి.

ఆ సంగతి అలా ఉంటే... ఇప్పటివరకూ ఈ కేసు దర్యాప్తు చేపట్టిన నలుగురు అధికారులు విచారణ మధ్యలోనే వైదొలిగారు. అందుకు వారు చెప్పిన కారణాలు... "హత్యకు గురవుతామనే భయం" కావడం గమనార్హం. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ఐదో వ్యక్తిగా న్యాయమూర్తి హోదాలో ఉన్న అధికారి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది.

కాగా... 2021లో హైతీ అధ్యక్షుడిగా ఉన్న జొవెనెల్‌ మోయిస్‌ (53) హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు ఆయన ప్రైవేటు నివాసంలోకి ఎంటరై కాల్చిచంపారు. ఈ ఘటనలో జొవెనెల్‌ మోయిస్‌ సతీమణి మార్టిన్‌ మోయిస్‌ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో... "సాయుధ కమాండో గ్రూపు" సభ్యులే అందుకు కారణమని అప్పటి ప్రధాని క్లాడె జోసెఫ్ ఆరోపించారు.