వెబ్ సిరీస్ స్ఫూర్తితో మీరట్ డబుల్ మర్డర్ కేసు.. షాకింగ్ నిజాలు బయటకు
By: Tupaki Desk | 13 Aug 2023 6:32 AM GMTదేశంలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న కొన్ని దారుణాల్ని చూసినప్పుడు షాక్ తింటున్న పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి మీరట్ లో చోటు చేసుకుంది. ఇద్దరు పెద్ద వయస్కుల్ని దారుణంగా చంపేసి.. వారి ఆస్తిపాస్తుల్ని కొట్టేసిన ఉదంతం పోలీసులకు సవాలుగా మారింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలోని మిస్టరీని ఛేదించారు పోలీసులు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బోలెడన్ని బయటకు వచ్చాయి.
ఆ వివరాలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. యూపీలోని మీరట్ పట్టణంలోని బ్రహ్మపురి ప్రాంతంలో 70 ఏళ్ల ధన్ కుమార్ జైన్.. 65 ఏళ్ల అంజు జైన్ లు నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం వేళలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఈ పెద్ద వయస్కులపై బెదిరింపులకు దిగారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకోగా.. దుండగులు పిస్టల్ తో ఆ ఇద్దరిని కాల్చి చంపేశారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం.. నగదును దోచుకెళ్లారు.
పట్టపగలుచోటు చేసుకున్న ఈ డబుల్ మర్డర్ స్థానికంగా పెను సంచలనంగా మారింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు 48 గంటల గడిచేసరికి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. షాకింగ్ అంశం ఏమంటే.. ఈ దారుణ నేరానికి పాల్పడిన వారిలో ఒకరు ఎల్ఎల్ బీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కావటం గమనార్హం.ఈజీ మనీకి అలవాటు పడిన వారు.. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఒక వెబ్ సిరీస్ (అసుర్) ను చూసిన పాతికేళ్ల ప్రియాంక్ శర్మ.. 24 ఏల్ల యశ్ శర్మలు ఇద్దరు కలిసి ఈ డబుల్ మర్డర్ కు ప్లాన్ చేశారంటున్నారు. దొంగతనం ఎలా చేయాలి? పోలీసులకుఎలా మస్కా కొట్టాలి? వారికి ఆధారాలు చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తమ గుర్తింపు దొరక్కుండా ఉండకుండా ఎలాంటి గ్లౌజ్ లు.. హెల్మెట్లు.. బైక్ నెంబర్లను మార్చేశారు. చివరకు సీసీ కెమేరాలు లేని రూట్లను కసరత్తుచేసి మరీ.. పారిపోయారు. అయితే.. పోలీసులు తమదైన శైలిలో విచారణకు దిగేసరికి.. గంటల వ్యవధిలో నిందితులు దొరికిపోయారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో దొంగల్ని అదుపులోకి తీసుకోవటం చాలా చాలా తేలికన్న విషయాన్ని మిస్ కాకూడదు. ఈ లాజిక్ మిస్ అయ్యి.. ఎల్ఎల్ బీ లాస్ట్ ఇయర్ చదువుతూ ఇప్పుడు జైలుఊచలు లెక్కిస్తున్న పరిస్థితి.