ఫ్రిజ్ లో 7 నెలలుగా ఆమె డెడ్ బాడీ.. ఈ దారుణం ఎక్కడంటే?
ప్రస్తుతం కుళ్లిన స్థితిలో ఉన్న ఈ డెడ్ బాడీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లోని దెవాస్ లో ఈ దారుణం వెలుగు చూసింది.
By: Tupaki Desk | 12 Jan 2025 6:30 AM GMTమరో దారుణం వెలుగు చూసింది. ఏడు నెలల క్రితం ఒక మహిళను దారుణంగా చంపేసి.. ఫ్రిజ్ లో ఉంచేసిన వైనం ఇంత ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల అంచనా ప్రకారం సదరు మహిళను ఏడు నెలల క్రితం చంపేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం కుళ్లిన స్థితిలో ఉన్న ఈ డెడ్ బాడీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లోని దెవాస్ లో ఈ దారుణం వెలుగు చూసింది.
ఈ ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ ఇండోర్ లో ఉంటాడు. రెండేళ్ల క్రితం తన ఇంటిని ఉజ్జయినికి చెందిన సంజయ్ పటీదార్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. అయితే.. గత ఏడాది అతను ఇంటిని ఖాళీ చేశాడు. అయితే.. ఇంట్లోని మాస్టర్ బెడ్రూం.. స్టడీ రూంలో తన వస్తువుల్ని పెట్టుకుంటానని.. కొన్నాళ్ల తర్వాత వాటిని ఖాళీ చేస్తానని చెప్పటంతో యజమాని సరేనని ఒప్పుకున్నారు.
ఆప్పటి నుంచి ఇంట్లోని ఆ భాగానికి తాళం వేశారు. మిగిలిన భాగంలో మరో వ్యక్తికి అద్దెకు ఇవ్వటంతో అతడు అక్కడే ఉంటున్నాడు. కొన్నిరోజుల నుంచి తాళం వేసిన ఇంటి గదికి కరెంటు సౌకర్యాన్ని నిలిపేశారు. దీంతో.. ఫ్రిజ్ పని చేయకపోవటంతో డెడ్ బాడీ నుంచి దుర్వాసన రావటం మొదలైంది. స్థానికులు ఇంటి యజమానికి సమాచారం ఇవ్వటంతో.. వారు వచ్చి శుక్రవారం ఇంటి తలుపులు తెరిచారు. ఫ్రిజ్ లో డెడ్ బాడీ ఉన్న విషయాన్ని గుర్తించారు.
అప్పట్లో అద్దెకు తీసుకున్న సంజయ్.. గత జూన్ లోనే హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఈ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వటంతో వారు రంగంలోకి దిగి.. సంజయ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు గురైన మహిళను ప్రతిభ అలియాస్ పింకీగా గుర్తించారు. ఆమెతో సంజయ్ సహజీవనం చేసేవాడని చెబుతున్నారు. 2024 మార్చి నుంచి ఆమె కనిపించటం లేదని..
సంజయ్ ను అడిగితే ఆమె తన తల్లి ఇంటికి వెళ్లినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. ఇంతకూ ఆమెను సంజయ్ ఎందుకు హత్య చేశారన్న విషయాన్ని పోలీసులు ఆరా తీయగా.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవటంతో ఆమెను చంపేసినట్లుగా నిందితుడు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ వైనం స్థానికంగా పెను సంచలనంగా మారింది.