పాక్ లో పైశాచికం.. 15 మంది అబ్బాయిలపై ఇద్దరు టీచర్ల రేప్
విన్నంతనే ఉలికిపాటుకు గురి కావటమే కాదు.. ఇదేం పైశాచికమన్న భావన కలిగే ఈ ఉదంతం దాయాది పాకిస్తాన్ లో చోటు చేసుకుంది
By: Tupaki Desk | 21 Nov 2023 5:02 AM GMTవిన్నంతనే ఉలికిపాటుకు గురి కావటమే కాదు.. ఇదేం పైశాచికమన్న భావన కలిగే ఈ ఉదంతం దాయాది పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. పదిహేను మంది అబ్బాయిలపై ఇద్దరు టీచర్లు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం బయటకు వచ్చి సంచలనంగా మారింది. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో చోటు చేసుకున్న ఈ దారుణకాండను ఒక అబ్బాయి వెల్లడించటం.. ఆ వెంటనే అతడి తండ్రి స్పందించిన కారణంగా ఈ పైశాచిక దాడికి సంబంధించిన షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాధిత బాలుర సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
బాధిత విద్యార్థులంతా పది నుంచి పన్నెండేళ్ల బాలురుగా పోలీసులు చెబుతున్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఉస్మాన్ అన్వర్ తాజాగా ఈ షాకింగ్ కేసు వివరాల్ని వెల్లడించారు. మతపరమైన విద్యా సంస్థలో చదువుకునే మైనర్ బాలురల్లో ఒకరిని అతడి తండ్రి స్కూల్ వద్ద దింపుతున్న వేళలో.. తాను స్కూల్ కు వెళ్లనని పెద్ద ఎత్తున ఏడవటంతో.. ఎందుకని సముదాయిస్తూ అడిగిన నేపథ్యంలో...తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి చెప్పటంతో ఆ తండ్రి షాక్ తిన్నాడు.
అంతేకాదు.. తాను మాత్రమే కాదని తన స్కూల్ లో మరికొంతమంది విద్యార్థులు కూడా ఇలాంటి దాడినే ఎదుర్కొంటున్నట్లుగా చెప్పటంతో.. స్పందించిన ఆ తండ్రి వెంటనే పంజాబ్ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో.. స్పందించిన పోలీసులు వెంటనే స్కూల్ కు వెళ్లి విచారణ జరిపారు. అంతేకాదు.. బాధిత విద్యార్థుల్ని వైద్య పరీక్షలకు పంపగా.. వారిపై లైంగిక దాడి జరిగినట్లుగా తేలింది. అంతేకాదు.. వారి ఒంటిపై పంటిగాట్లు ఉన్న విషయాన్ని గుర్తంచారు.
దీంతో.. దీనికి కారణమైన ఇద్దరు టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులైన పదిహేను మంది బాలుర నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు.ఈ సందర్భంగా నిందితుల నుంచి ఒక చాకును స్వాధీనం చేసుకున్నారు. ఈ షాకింగ్ ఉదంతంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మోహ్ సిన్ నఖ్వీ స్పందించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్న ఆయన.. కేసును త్వరగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.