స్వర్గం చూపిస్తానని.. 191 మంది పిల్లలను!
ఇప్పుడు ఇలాగే ఒక మత నాయకుడిని నమ్మిన కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు
By: Tupaki Desk | 7 Feb 2024 3:30 PM GMTప్రపంచం.. రోజుకో కొత్త టెక్నాలజీతో శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది. శాస్త్రసాంకేతిక రంగాలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా మూఢ నమ్మకాలను నమ్మేవారు మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఈ మూఢ నమ్మకాలను ఆసరాగా తీసుకుంటున్న దొంగ స్వాములు, ఆయా మతాల బోధకులు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.
ఇప్పుడు ఇలాగే ఒక మత నాయకుడిని నమ్మిన కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు. తల్లిదండ్రులతో పిల్లలు స్వర్గానికి వెళ్తారని నమ్మించిన మత నాయకుడు 191 మంది పిల్లల చావుకు కారణమయ్యాడు. అంతేకాకుండా మరెన్నో నేరాలకు కూడా అతడు పాల్పడ్డాడని చెబుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో గగ్గోలు రేగింది.
ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఆఫ్రికాలోని కెన్యా దేశానికి చెందిన పాల్ మెకెంజీ ఆ దేశంలో కల్ట్ లీడర్ గా పేరు తెచ్చుకున్నాడు. కెన్యాలోని షాకహోలా అడవుల్లో అతడు ‘గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్’ పేరుతో ఒక చర్చిని నడుపుతున్నాడు. పూర్తిగా ఒంటరిగా, ఎడారిగా ఉన్న ఈ ప్రాంతంలో ఆ చర్చి మొత్తం 800 ఎకరాల్లో ఉంది.
చర్చి ఉన్న ప్రాంతంలో పాల్ మెకెంజీ అనుచరులు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వీరంతా ఆ ప్రాంతంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన కాలనీని ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కాలనీలో రానురాను వ్యక్తుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అలాగే కొత్తవారు కూడా వెళ్లడం లేదు. దీంతో అనుమానాలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో ఏకంగా 400 మృతదేహాలు భయటపడటంతో అధికారులు షాక్ తిన్నారు. ఈ 400 మృతదేహాల్లో 191 చిన్నపిల్లలవని వెల్లడైంది. ఆకలితో వాళ్లంతా మరణించారని విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు పాల్ తో పాటు అతని అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు.
మత నాయకుడు పాల్ మెకెంజీ ఉంటున్న ప్రాంతంలో తల్లిదండ్రులు తమ పిల్లలు అనారోగ్యం బారినపడితే ఆస్పత్రులకు తీసుకువెళ్లేవారు కాదు. అలాగే బడికి వెళ్లే పిల్లలు అంత చురుకుగా లేకపోయినా పాల్ మెకెంజీ వద్దకు తీసుకొచ్చేవారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ వినాశనం వస్తుందని.. కాబట్టి వినాశనానికి ముందే మరణిస్తే స్వర్గానికి చేరుకోవచ్చని పిల్లల తల్లిదండ్రులకు పాల్ మెకెంజీ నూరిపోసేవాడు. పిల్లలను ఆకలితో మాడ్చేవాడు. దీంతో ఆకలికి తాళలేక 191 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు.
ఈ కేసులో పాల్ తో పాటు 29 మంది అనుచరుల్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని మలిండి నగరంలోని కోర్టులో హాజరుపరిచారు. అయితే.. తాము ఏ తప్పూ చేయలేదని వారంతా తమపై ఆరోపణలను ఖండిస్తున్నారు.
కాగా పాల్ మెకెంజీపై పిల్లల హత్య కేసులే కాకుండా అనుచరులను చంపడం, తీవ్రవాదం, హింసకు ప్రేరేపించడం వంటì అభియోగాలు కూడా ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌లో లైసెన్స్ లేకుండా సినిమాలు తీసి, వాటిని పంపిణీ చేసిన కేసులోనూ పాల్ జైలు పాలయ్యాడు. ఈ కేసులో అతడికి 12 నెలల జైలుశిక్ష పడింది. ఇప్పుడు ఇక తాజా కేసులో అతడికి ఎలాంటి శిక్ష పడుతుందనేది ఆసక్తికరంగా మారింది.