రూ.40 కోట్లు దారి మళ్లించిన నిర్మాత!... పక్క స్క్రీన్ ప్లే తో చీటింగ్!?
అవును... ఓ సినీ నిర్మాత.. బ్యాంకు మేనేజర్, ఉద్యోగి సహాయసహకారాలతో రూ.40 కోట్లు కొల్లగొట్టాడు.
By: Tupaki Desk | 31 July 2024 5:39 AM GMTసినిమాలకు నిర్మాతగా ఉంటూ బలమైన స్క్రిప్ట్ వర్క్ తో, బిగుతైన స్క్రీన్ ప్లే తో ఓ నేరానికి పథకం రచించాడని.. ఫలితంగా బ్యాంక్ అధికారుల సహాయ సహకారాలతో రూ.40 కోట్లు కొల్లగొట్టాడనే వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈ.వో.డబ్ల్యూ) పోలీసులు దీన్ని ఛేదించి.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు.
అవును... ఓ సినీ నిర్మాత.. బ్యాంకు మేనేజర్, ఉద్యోగి సహాయసహకారాలతో రూ.40 కోట్లు కొల్లగొట్టాడు. ఈ మేరకు ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.40 కోట్లను దారి మళ్లించారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు చేధించారు. ఈ సందర్భంగా ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసాద్.. ముగ్గురుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కు చెందిన ఓ వ్యక్తి.. అనేక తెలుగు సినిమాల్లో నటించడంతోపాటు, కొన్ని సినిమాలు నిర్మించాడు కూడా నట. అయితే హైదరాబాద్ సీసిఎస్ సహా పలు పోలీస్ స్టేషన్ లలో ఈయనపై సుమారు 10 వరకూ చీటింగ్ కేసులున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ ఇండ్ బ్యాంక్ శంషాబాద్ బ్రాంచ్ మేనేజర్ తో సరికొత్త పథకం రచించాడని అంటున్నారు.
ఇందులో భాగంగా... ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థకు ముంబైలోని నరీమన్ పాయింట్ ప్రాంతంలోని ఇండస్ ఇండ్ బ్యాంకు బ్రాంచ్ లో ఉన్న ఖాతా నుంచి జూలై 12న శంషాబాద్ బ్రాంచ్ లో ఓ ఖాతాకు ఓసారి రూ.25 కోట్లు, మరోసారి రూ.15 కోట్లు బ్యాంక్ మేనేజర్, ఉద్యోగి కలిసి బదిలీ చేశారట. ఆ తర్వాత ఆ డబ్బును ఇతర ఖాతాలకు సదరు నిర్మాత బదిలీ చేశాడని అంటున్నారు.
అనంతరం వాటిని విత్ డ్రా చేసుకుని రెండు కార్లు కొని.. అందులో ఒకటి సదరు బ్యాంక్ మేనేజర్ కి ఇచ్చినట్లు చెబుతున్నారు. లావాదేవీలు జరగడానికి కేవలం 8 రోజుల ముందే ఈ రూ.40 కోట్లు రెండు విడతల్లో పంపబడిన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనుమాస్పద లావాదేవీగా భావించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా.. అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు.
దీనికి సంబంధించి బ్యాంక్ మేనేజర్, ఉద్యోగిలను ఈనెల 24న సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా... సదరు నిర్మాత పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు. దీంతో.. అతడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన బృందం అతన్ని సోమవారం ఢిల్లీలో అరెస్ట్ చేసి, హైదరబాద్ కు తెరలించినట్లు తెలుస్తోంది!