రీల్స్ చేస్తోందని చెల్లిని కొట్టి చంపేసిన అన్న!
రాజీవ్ నగర్ కు చెందిన అజ్మీర సింధు(21) అలియాస్ సంఘవికి తల్లి, సోదరుడు హరిలాల్ ఉన్నారు.
By: Tupaki Desk | 26 July 2023 10:48 AM GMTఈమధ్య కాలంలో సోషల్ మీడియా కోసం అత్యధిక సమయం కేటాయించే జనం విపరీతంగా పెరిగిపోతున్నారని.. సరాసరిన రోజుకు వారు దీనికోసం కేటాయించే సమయం కూడా పెరిగిపోతోందని అంటున్నారు. అయితే దీనివల్ల చాలా కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయనే కథనాలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి!
ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో ఉంటుండటం.. నిత్యం రీల్స్ చేస్తుండటం అలవాటుగా కలిగిన యువతి ప్రాణాలు పోయిన సంఘటన తాజాగా జరిగింది! పైగా ఈ దారుణానికి ఒడిగట్టింది సొంత అన్నే కావడం గమనార్హం. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది.
అవును... చెల్లెలు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతోందని ఆగ్రహించిన అన్న.. ఆమెను రోకలిబండతో కొట్టి హత్య చేశాడు! ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్ నగర్ లో జరిగింది. అయితే... రాయి తగిలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేయగా.. గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులను పిలవడంతో అసలు విషయం బయటపడిందని తెలుస్తుంది.
రాజీవ్ నగర్ కు చెందిన అజ్మీర సింధు(21) అలియాస్ సంఘవికి తల్లి, సోదరుడు హరిలాల్ ఉన్నారు. మహబూబాబాద్ లో ఏ.ఎన్.ఎం. అప్రెంటిస్ చేస్తున్న సింధు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. ఇది నచ్చని హరిలాల్ ఆమెతో తరచూ గొడవపడేవాడు. తాజాగా ఈ విషయం మీదే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
ఈ క్రమంలో హరిలాల్... రోకలిబండ తీసుకొని ఆమె తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ సమయంలో మెరుగైన చికిత్స కోసం వరంగల్ తీసుకెళ్తుండగా ఆమె మృతిచెందారు అని పోలీసులు తెలిపారు.
అయితే ఆమె మరణించిన వెంటనే కుటుంబసభ్యులు హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టడంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ దాడిలో చెల్లెలి మరణానికి కారకుడైన హరిలాల్ అప్పటికే పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారణం ఏదైనా.. సందర్భం మరేదైనా.. శృతిమించిన సోషల్ మీడియా యాక్టివిటీస్ వల్ల ఎన్నో జీవితాలు, మరెన్నో కుటుంబాలు చిధ్రమైపోతున్నాయని అంటున్నారు!