సేం పేట్రన్... తాంత్రిక పూజల పేరుతో 10కి పైగా హత్యలు?
నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి తాంత్రిక పూజల పేరుతో ఏకంగా పది మందికిపైగా అమాయక ప్రజలను హత్య చేశాడనే విషయం తాజాగా తీవ్ర కలకలం రేపుతోంది.
By: Tupaki Desk | 12 Dec 2023 5:12 AM GMTనాగర్ కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి తాంత్రిక పూజల పేరుతో ఏకంగా పది మందికిపైగా అమాయక ప్రజలను హత్య చేశాడనే విషయం తాజాగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సమయంలో ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు పూర్తి వివరాలను బయటకు లాగే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం వెలుగులోకి వస్తున్న విషయాలు ఈ హత్యలు ఎంత పక్కాగా స్కెచ్ వేసి చేశారనేది స్పష్టమవుతుంది.
అవును... విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. నాగర్ కర్నూల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో 2018లో వార్డు కౌన్సిలర్ గా కూడా పోటీ చేసి ఓడిపోయాడు. అనంతరం తాంత్రిక పూజలు చేస్తానంటూ అమాయక ప్రజలను నమ్మించడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా గుప్తనిధులు వెలికితీస్తానంటూ వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు.
ఈ సమయంలో అతడి మాయమాటలు నమ్మిన అమాయక ప్రజలు అతనికి పెద్ద మొత్తంలో డబ్బు ముట్టచెప్పేవారు. ఇక డబ్బులు అందుబాటులో లేనివారు అయితే ఏకంగా వారి వారి స్థిరాస్తులను ఇతడి పేర రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడు. నిధి దొరికిన తర్వాత తనకు డబ్బులు ఇస్తే తిరిగి వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసిస్తానని చెప్పేవాడు. అప్పుడే ఇతడి అసలు బుద్ది బయటపడేదని తెలుస్తుంది.
ఇందులో భాగంగా గుప్తనిధుల పేరు చెప్పి కాలయాపన చేసిన అనంతరం ఎంతకీ ఆ పని జరగకపోయేసరికి... వారు తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగినా, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ తిరిగి చేయమని అడిగినా... ఇవాళ, రేపు అంటూ తప్పించుకుతిరిగేవాడు. ఈ సమయంలో మరింత ఒత్తిడిచేసిన వారిని గుట్టుచప్పుడు కాకుండా క్షుద్రపూజల పేరిట దూరప్రాంతాలకు తీసుకెళ్లి హత్య చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
తీగ లాగితే కదిలిన డొంక..:
చాలా కాలంగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ లో మూడేళ్ల క్రితం ఒకే కుటుంబానికి చెందిన హజీరాంబీ(60), అస్మాన్ బేగం(42), ఖాజాపాషా(45), అర్షిణ్ బేగం(9)లు హత్య కేసుకు తాజాగా హైదరాబాద్ లో లింక్ దొరకడంతో ఈ వ్యవహారంలో గుట్టు వీడిందని తెలుస్తుంది.
ఇటీవల హైదరాబాద్ లోని బొల్లారంలో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్.. నవంబరులో నగర శివారులో హత్యకు గురయ్యారు. ఈ సమయంలో నిందితుడికి వెంకటేశ్ కుటుంబసభ్యులతో కొంతకాలంగా పరిచయం ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో అదే నెల 26న నాగర్ కర్నూల్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు క్షుద్రపూజల పేరుతో హత్య చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
దీని ఆధారంగా తీగ లాగడంతో ఇదే తరహాలో అనేక హత్యలు చేసినట్లుగా నిందితుడు వెల్లడించినట్లు తెలుస్తుంది. పాలలో బంగారం కరిగించే రసాయనం కలిపి.. తీర్ధంగా ఇచ్చి హత్యలు చేస్తున్నాడని సమాచారం!